పద పదవే వయ్యారి గాలిపటమా..

4 Jan, 2017 23:04 IST|Sakshi

ఓరుగల్లులో పతంగుల విహారం
మొదటిసారిగా ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌
హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల  వేదికగా ఈనెల 17న సంబురాలు
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ఆట
వీక్షకుల కోసం స్టాళ్లు, ఫుడ్‌ కోర్టుల ఏర్పాటు
హాజరుకానున్న30 దేశాల ప్రతినిధులు


హన్మకొండ :  ఆకాశంలో రివ్వు రివ్వున ఎగురుతూ.. వివిధ రకాల రంగులతో ఊయలూగుతూ.. చిన్నారులు, యువకులతో కేరింతలు కొట్టించే పతంగుల పండుగ సంబురాలకు వరంగల్‌ నగరం వేదిక కానుంది. ఆకర్షణీయమైన ఆకృతులతో నింగిలోకి ఎగిరే గాలిపటాలు ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు మహానగరంలో ఈనెల 17న ఆంతర్జాతీయ పతంగుల పం డుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ పర్యాటకుల దృష్టిని వరంగల్‌ జిల్లా వైపునకు మరలించేందుకు ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంటర్‌ నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఈనెల 14, 15 తేదీల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16న, వరంగల్‌లో 17న ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న సంబురాల ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో వేడఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

30 దేశాల నుంచి క్రీడాకారులు..
అంతర్జాతీయ పతంగుల పండుగలో 30 దేశాల నుంచి ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరితో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా హాజరుకానున్నారు. సంబురాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన ఉదయం ఖిలా వరంగల్‌లో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తారు. అనంతరం అల్ఫాహారం చేసి ఆర్ట్స్‌ కళాశాలకు చేరుకుని పతంగులను ఎగురవేస్తారు. కాగా, గాలిపటాల ఆటను నిర్వహిస్తున్న చోట క్రాఫ్ట్‌బజార్, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వరంగల్‌ జర్రీస్, పెంబర్తి కళా ఖండాలు, చేర్యాల నకాషీ చిత్రాలు, హస్త కళలు, చేనేత ఉత్పత్తులను స్టాళ్లలో పెట్టనున్నారు. వీటితో పాటు పండుగను వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా అంతర్జాతీయ పతంగుల పండుగను ఇక్కడ నిర్వహిస్తుండడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటక రంగాన్ని పరిచయం చేసేందుకే..
పాత వరంగల్‌ జిల్లాలోని పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయస్థాయి పతంగుల సంబురాల్లో విదేశాల్లోని ఔత్సాహిక క్రీడాకారులు ఈనెల 16న హన్మకొండకు చేరుకుంటారు. 17న ఉదయం వారితో పాటు తెలంగాణలో ఆసక్తి కలిగిన క్రీడాకారులు పతంగుల పోటీలో పాల్గొంటారు. వీక్షకుల కోసం క్రాఫ్ట్‌బజార్, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం.     – శివాజీ, జిల్లా పర్యాటక అధికారి

మరిన్ని వార్తలు