నూతన వంగడాలపై దృష్టి

4 Aug, 2016 18:41 IST|Sakshi
నూతన వంగడాలపై దృష్టి

వేముల :
పంటల సాగులో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా ఆశించిన మేర దిగుబడులు అందడంలేదు. స్థానికంగా అందుబాటులో ఉన్న విత్తనాలను సాగు చేయడం వలన దిగుబడులు పెరగడం లేదనే భావన రైతులలో ఉంది. దీంతో కొంతమంది రైతులు నూతన వంగడాలవైపు దృష్టి సారిస్తున్నారు. ఇండాన్‌–5 అనే రకం మిరప విత్తనాలు కిలో లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. కేవలం ఈ రకం పంట ఎండు మిరపకాయలకే సాగు చేస్తున్నారు. ఎకరాకు 35నుంచి 40క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయనే ఉద్దేశంతో మల్చింగ్‌తో ఈ రకం మిరప సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. పులివెందుల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో మిరప సాగవుతుంది.  స్థానికంగా దొరుకుతున్న విత్తనాలను సాగు చేస్తున్నారు. దీంతో సాగులో ఆశించిన మేర ఫలితాలు అందడంలేదు. ఈనేపథ్యంలో రైతులు ఇండో – అమెరికన్‌ కంపెనీకి చెందిన ఇండాన్‌–5 అనే రకం మిరప సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో ఈ రకం పంట ఈ ప్రాంతంలోని రైతులు సాగు చేయలేదు. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, కృష్ణ జిల్లాల్లోనే సాగవుతుంది.
ఇండాన్‌–5 కిలో విత్తనాలు లక్షకుపైనే.. :
ఇండాన్‌–5 అనే రకం మిరప విత్తనాలు కిలో లక్ష రూపాయలకుపైనే చెల్లించాలి. ఇండో – అమెరికన్‌ కంపెనీకి చెందిన ఈ రకం మిరప విత్తనాలకు డిమాండు ఎక్కువగా ఉంది. ఈ పంటను ఎక్కువగా నల్లరేగడి నేలల్లో సాగు చేస్తారు. ఈ రకం పంటను ఎండు మిరప కాయలకే సాగు చేస్తారు. ఎండు మిరపకాయలకు క్వింటా రూ. 15వేలకు తగ్గకుండా ధరలు ఉంటాయి. దీంతో రైతులు ఈ రకం సాగుపై మక్కువ చూపుతున్నారు.
ఎకరాకు 50గ్రాముల విత్తనాలు :
ఇండాన్‌–5 అనే రకం మిరప సాగుకు ఎకరాకు 80గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. గుంటూరులో కొనుగోలు చేసి తెచ్చిన విత్తనాలను వేములలోని నర్సరీలో పెంచుతున్నారు. ఈ రకం విత్తనాలు డబ్బాల్లో దొరుకుతాయి. ఒక్క డబ్బాలో 10గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో డబ్బా రూ.1500లుతో కొనుగోలు చేసి తెచ్చారు.  వేములలోని నర్సరీలో పెంచినందుకు మొక్కకు 30పైసలు యజమానికి చెల్లిస్తున్నారు. 80గ్రాముల విత్తనాలకు 12వేల మొక్కలను నర్సరీలో పెంచారు. ఎకరాకు 12వేల మొక్కల చొప్పున నాటుతున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలకు 40రోజుల వయస్సు ఉంది. మరో వారంలో మొక్కలను రైతులు నాటేందుకు భూములను సిద్ధం చేస్తున్నారు.
ఎకరాకు 35నుంచి 40క్వింటాళ్ల దిగుబడులు :
ఇండాన్‌–5 అనే రకం మిరప సాగులో ఎకరాకు 35నుంచి 40క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. పంట కాలం ఆరేడు నెలలు ఉంటుంది. పంట సాగు చేసిన నాలుగైదు నెలలకే  కోతకు వస్తాయి. ఎకరాకు ఈ రకం మిరప సాగుకు లక్ష వరకు పెట్టుబడులు అవుతాయి. ఎందుకంటే మిరప పండ్లు వచ్చేవరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పంటలో తెగుళ్ల నివారణకు ముందు జాగ్రత్తలు అవసరం.. ఎప్పటికప్పుడు మందులను స్ప్రే చేస్తూ తెగుళ్లను నివారిస్తూ ఉండాలి. ఈ రకం పంట సాగులో అన్ని మెళకువలు పాటించినప్పుడే ఎకరాకు 35నుంచి 40క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి.
మల్చింగ్‌ పద్దతిలో మిరప సాగు :
మండలంలోని పెర్నపాడు, వి.కొత్తపల్లె గ్రామాల్లోని రైతులు ఇండాన్‌–5 అనే కొత్త రకం మిరప సాగును చేస్తున్నారు. ఈ రకం మిరప సాగును మల్చింగ్‌ పద్దతిలో రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో రైతు 2నుంచి 3ఎకరాల్లో ఈ రకం మిరప సాగు చేస్తున్నారు. ఇందుకోసం రైతులు గుంటూరులో మిరప విత్తనాలు తెచ్చుకొని నర్సరీలో మొక్కలు పెంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

 
 

మరిన్ని వార్తలు