ప్రజా సంక్షేమమే ధ్యేయం

23 Jul, 2016 22:48 IST|Sakshi
ప్రజా సంక్షేమమే ధ్యేయం

రాయచోటి:
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. రాయచోటికి వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్లు రెండు కళ్లులాంటివన్నారు. ఆ ప్రాజెక్టులతోపాటు శాశ్వత అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, అవసరమైనటువంటి పలు పథకాలను తన తండ్రి గడికోట మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోను.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చేపట్టడం గర్వంగా ఉందన్నారు. ఇటీవల వెలిగల్లు ప్రాజెక్టు ఆయకట్టుదారుల సమావేశంలో నీటిని త్వరగా విడుదల చేస్తామని కలెక్టర్‌ చెప్పడం ఆనందంగా ఉందన్నారు.

వెలిగల్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తి అయినా, ఒప్పందం లేకపోయినా ఎంపీ మిథున్‌రెడ్డి తన సొంత డబ్బును సుమారు రూ.30 లక్షలు వెచ్చించి, కాల్వలో నీళ్లు సరఫరా అయ్యేలా చేయడం అభినందనీయమన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు కాల్వలో ఒక అడుగు లోతు మట్టి ఎత్తివేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు కోరడంతో.. ఈ విషయాన్ని తాను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఆ పనులను చేపట్టేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చి ఇచ్చారని పేర్కొన్నారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె ప్రధాన కాలువ ఉన్నంత వరకు ఆ నీటితో చెరువులన్నింటినీ నింపవచ్చునని, కాలువకు ఎటువంటి ఆటంకాలు కల్పించకపోతే హసనాపురం, గంగనేరు, దిన్నెపాడు చెరువులకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్‌ కాలువ పనులు అంతంత మాత్రమే జరుగుతున్నాయన్నారు. ముంపు ప్రాంత రైతులకు నష్టపరిహారం
చెల్లింపు విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుండడం బాధాకరమన్నారు. వీలైనంత త్వరగా శ్రీనివాసపురం రిజర్వాయర్‌ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని డిమాండ్‌ చేశారు. వెలిగల్లు కాలువ పనులను పూర్తి చేసి కుడి కాలువకు త్వరగా నీటిని వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు