శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం

11 Aug, 2016 00:35 IST|Sakshi
శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం
  • ఎన్‌ఎన్‌ఎఫ్‌ ప్రతినిధి డాక్టర్‌ అసితోష్‌ మహాపాత్ర 
  • వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం సందర్శన
  •  ఎంజీఎం : దేశవ్యాప్తంగా రోజుకు వేయ్యి మంది చిన్నారులు జన్మిస్తే అందులో 39 మంది చిన్నారులు నెల నిండక ముందే మృత్యువాతపడుతున్నారని, ఈ మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా నేషనల్‌ నియోనాటాలజీ ఫోరం (ఎన్‌ఎన్‌ఎఫ్‌) ప్రయత్నిస్తున్నదని ఒరిస్సాకు చెందిన ఎన్‌ఎన్‌ఎఫ్‌ ప్రతినిధి డాక్టర్‌ అసితోష్‌ మహాపాత్ర చెప్పారు. బుధవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో శిశువులకు అందుతున్న వైద్యసేవలతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలను ఆయన పరిశీలించారు.
     
    అనంతరం మాట్లాడుతూ ఎన్‌ఎన్‌ఎఫ్‌ అక్రిడిడేషన్‌ సర్టిపికేషన్‌ పొందడానికి నేషనల్‌ నియోనాటాలజీ ఫోరం నిర్దేశించిన కచ్చితమైన ప్రమాణాలలో వైద్యసేవలందించండంతో పాటు ప్రత్యేకమైన విధానాలు పాటించాలన్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే ఆయాతో పాటు నర్సింగ్‌ సిబ్బంది, వైద్యులు ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉండాలన్నారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలోని నర్సింగ్‌ సిబ్బంది శిశువులకు అందిస్తున్న వైద్యసేవల విధానాలపై వారిని అడిగి తెలుసుకున్నారు.
     
     ఆస్పత్రిలో ఉన్నమౌలిక సదుపాయాలు, వైద్యసిబ్బంది, వైద్యుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నివేదికను ఢిల్లీ బృందానికి సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి అక్రిడిడేషన్‌ సర్టిఫికెట్‌ లభిస్తే సేవలు మరింత మెరుగుపడే ఆవకాశం ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సర్టిఫికేషన్‌తో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు భవిష్యత్తులో డీఎం నియోనాటాలజీ వంటి ప్రత్యేక కోర్సులు వచ్చే ఆవకాశం లభిస్తుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని వైద్యవిద్య కళాశాలలో పరిధిలో ఉన్న ఏ ఆస్పత్రీ  ఇంత వరకు ఈ సర్టిఫికేషన్‌ పొందలేదన్నారు. 
     
మరిన్ని వార్తలు