గాడితప్పిన దేశ పాలన:మాడభూషి

28 Aug, 2016 23:03 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న మాడభూషి శ్రీధర్, చిత్రంలో ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, గోపాలరావు, మోహన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల దేశంలో పరిపాలన నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు పనిలేదని, జడ్జీలను కూడా నియమించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇంద్రసేన కంచర్ల రాసిన ‘ఛేంజింగ్‌ పొలిటికల్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఇండియా అండ్‌ ది వరల్డ్‌’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాడభూషి మాట్లాడుతూ.. ఈ దేశంలో గవర్నెన్స్‌ రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు దేశంలో ఉన్నది నిరుద్యోగ సమస్య కాదు.

నిరుద్యోగ ఖాళీలను భర్తీ చేయలేని సమస్య. సమాచార కమిషనరేట్‌తో పాటు తహసీల్దార్‌ కార్యాలయం సహా దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోను సరిపడా ఉద్యోగులు లేరు. పోస్టులున్నా, జీతాలకు డబ్బులున్నా ఉద్యోగాలను భర్తీ చేసే దిక్కు లేదు. జడ్జీలను నియమించక పోవడంపై చీఫ్‌ జస్టిస్‌ కన్నీరు పెట్టుకోవడానికి గల కారణాలను విశ్లేషించాలి’ అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో 30 శాతం ఖాళీలు ఉన్నాయంటే 30 శాతం మంది ముద్దాయిలకు శిక్షలు పడనట్టేనని, వ్యవస్థ ఉండగానే సరిపోదని, దానికి పనిచేసే శక్తినివ్వాలని పేర్కొన్నారు. ఆర్జించిన ఆదాయానికి మించిన కేసులో ఓ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లి నిర్దోషిగా బయటకు వచ్చారంటే ‘ఆర్జించిన ఆదాయాని’కి డెఫినేషన్‌ తెలియకపోవడమేనన్నారు.

ఢిల్లీ రాజ్యంగ స్వరూపంలో 70 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన వారు కూడా కేంద్రం పరిధిలో లేకపోతే విలువ లేదని, అక్కడ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి పరిపాలనను శాసిస్తారే తప్ప ముఖ్యమంత్రి కాదని ఆయన పేర్కొన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే తీరు దేశంలో తీవ్రంగా ఉందన్నారు. విమర్శలు చేస్తే క్రిమినల్‌ డిఫర్మేషన్‌ కేసులు పెట్టే విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. అన్ని పర్యావరణ, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ..

సమాజంలో జరుగుతున్న పరిణామాలపై విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అంశాలు మొదలుకొని కశ్మీర్‌ వంటి సమస్యల దాకా మేధావులు, రచయితలు, కవులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చేందుకు వేదిక ఉండాలన్నారు. ఢిల్లీలోని ఇండియా ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ తరహాలో హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వేదిక కోసం గతంలో ప్రయత్నం జరిగినా, వెనక్కు పోయిందని, ఇకనైనా 2 లేదా 3 ఎకరాల్లో ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. మానవత్వం గల ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు స్వేచ్ఛగా అమలు కావాలని ఆశించే సిన్సియర్‌ సిటిజన్‌ కంచర్ల ఇంద్రసేన అని కొనియాడారు.

బాధ్యత గల మేధావిగా ఆయన రాసిన వ్యాసాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో భావప్రకటన స్వేచ్ఛ మరుగున పడడం ప్రమాదకర సంకేతమన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ చూడని విచ్ఛిన్నకర రాజకీయాలు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్య, గొడ్డు మాంసం తిన్నారని చంపేసే తీరు దేశంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయన్నారు. రచయిత ఇంద్రసేన కంచర్ల రాసిన పుస్తకాన్ని ప్రొఫెసర్‌ గోపాలరావు పరిచయం చేయగా, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎస్‌. రామచంద్రారెడ్డి, కొండలరావు ప్రసంగించారు.
 

మరిన్ని వార్తలు