ఆవిర్భావం.. అదరాలె

1 Jun, 2016 12:07 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ధూంధామ్‌గా నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఉత్సవాలు.. ఆటపాటలు ఎలా ఉండాలో మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆవిర్భావ వేడుకలు గ్రామం, మండలం, డివిజన్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు.

 

ప్రత్యేక రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, థియేటర్లను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.

 

అలాగే కార్యాలయ ఆవరణాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఆస్పత్రులు, అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే గురువారం నూతన పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, భూమి కొనుగోలు పథకం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
 
 ఉదయం 8గంటల నుంచి..
 జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, అమరవీరుల స్థూపం వద్ద భారీ నీటిపారదల శాఖ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పిస్తారు. అనంతరం పోలీస్ పెరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానిస్తారు. వివిధ రంగా ల్లో ప్రతిభావంతులు, నిష్ణాతులకు నగదు పారితోషికంతోపా టు ప్రశంసాపత్రం అందజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో  ఆయా శాఖలకు సంబంధించిన ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తారు.
 
 జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు..
 జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వారం రోజుల ముందే పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మురికికాల్వల్లో పూడిక తీయడం, వీధులు శుభ్రం చేయడం వంటివి చేస్తున్నారు. ప్రజా భవనాల పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. గ్రామపంచాయతీ భవనాలకు, వాటి అనుబంధ సంస్థల భవనాలకు అవసరమైనచోట కలర్స్ వేస్తున్నారు. గ్రామ పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, కార్యాచరణ కమిటీలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల్లో 25 కేజీల మిఠాయిలు పంపిణీ చేస్తారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు