‘ఆపరేషన్‌ స్మైల్‌’ను పటిష్టంగా చేపట్టాలి

31 Dec, 2016 02:07 IST|Sakshi
‘ఆపరేషన్‌ స్మైల్‌’ను పటిష్టంగా చేపట్టాలి

 బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
 జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన


జనగామ అర్బన్‌ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ స్మైల్‌ను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలో బాలల సంరక్షణ కొరకు నిర్వహించనున్న ఆపరేషన్‌ స్మైల్‌–3 కార్యక్రమంపై శుక్రవారం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్‌ స్మైల్‌–3 స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. తప్పిపోయిన, భిక్షాటన చేసే పిల్లలను వారి తల్లిదండ్రులకు చేర్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బాలలను పనిలో పెట్టుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను అదేశించారు. సమీక్షలో జనగామ ఏసీపీ పద్మనాభరెడ్డి, లేబర్‌ ఆఫీసర్‌ శంకర్, డీడబ్ల్యూఓ పద్మజారమణ తదితరులు పాల్గొన్నారు.

ఆలోచన విధానం మారాలి..  
దేశ పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానం మారాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలోని వైన్స్, బార్‌ షాపు యజ మానులతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దుకాణాల్లో తప్పకుండా స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. అమ్మకందారుడు మారితే వినియోగదారులు కూడా మారుతారన్నారు. ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా బ్యాంకింగ్‌ యాప్‌లను వాడుకోవాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు కోసమే నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామని  ఆమె పేర్కొన్నారు.

శామీర్‌పేటలో గ్రామ సందర్శన   
జనగామ : మండలంలోని శామీర్‌పేటలో శుక్రవారం గ్రామ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీదేవసేన, జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ ప్రసాద్‌రావుతోపాటు పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ శామీర్‌పేట గ్రామాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆదర్శ గ్రామం గా నిలపాలని ఆక్షాంక్షించారు. క్యాష్‌లెస్‌ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని సూచించారు. విద్యార్థులు నగదు రహి త చెల్లింపులపై అవగాహన ఏర్పరచుకుని వారి కుటుంబసభ్యులకు కూడా తెలియజేయాలన్నారు. గ్రామంలో ఇంకా బ్యాంకు అకౌంట్‌లు, క్రెడిట్‌ కార్డులు తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు