తాగి పాఠశాలకు వచ్చి హెడ్‌మాస్టర్ వీరంగం

4 Jul, 2016 10:09 IST|Sakshi

పీకలదాకా తాగి పాఠశాలకు వచ్చిన హెడ్‌మాస్టర్ అందరిపై చిందులువేస్తూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఎంఈవో వచ్చి ప్రశ్నించినా ఆయనపైనా దుర్భాషలాడుతూ నానా హంగామా చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

 తాగుబోతు ప్రిన్సిపాల్ తమకు వద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల హెడ్‌మాస్టర్ ఎస్. జయప్రకాష్ సోమవారం ఉదయం తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన హరిప్రసాద్ అనే పేరెంట్‌ను స్కూల్‌కు ఎందుకొచ్చావని తిట్టాడు. హెడ్‌మాస్టర్ వాలకం చూసిన అతను గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులందరూ పాఠశాల వద్దకు వచ్చి నిలదీయడంతో వారిపై వీరంగం సృష్టించాడు. సమాచారం అందుకున్న ఎంఈవో కోటేశ్వరరావు హుటాహుటిన పాఠశాలకు వచ్చి హెచ్‌ఎంను సముదాయించేందుకు ప్రయత్నించినా ఆయనపైనా చిందులు వేశాడు.

 

ఎవరికి చెప్పుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ తిట్ల దండకం అందుకున్నాడు. దాంతో బిత్తరపోయిన ఎంఈవో వెంటనే డీఈవోకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా హెడ్‌మాస్టర్ విద్యార్థుల పట్లస తల్లిదండ్రులపట్ల అనుచితంగా వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో 69 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తాగుబోతు హెడ్‌మాస్టర్ తమకు వద్దని, వెంటనే అతణ్ణి మార్చాలని గ్రామస్తులు పట్టుపడుతున్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు