మెక్కింది కక్కించరేం!

3 Jan, 2017 01:15 IST|Sakshi
మెక్కింది కక్కించరేం!

అక్రమాల పుట్టల ఉపాధి హామీ పథకం
సామాజిక తనిఖీల్లో అవినీతి తేలినా రికవరీ లేదు
రూ.4.08 కోట్లకు రాబట్టింది రూ.1.77 కోట్లే..
పదును లేని ఆయుధంగా రెవెన్యూ రికవరీ చట్టం


గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి.. ఉపాధి కల్పించాలనే   సదుద్దేశంతో దశాబ్దకాలం క్రితం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి అధికారులకు కల్పతరువుగా మారింది. పని చేయకున్నా.. చేసినట్లుగా లెక్కలు చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సామాజిక తనిఖీల్లో రూ. కోట్లలో అవినీతి బయటపడుతున్నా నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న   అధికారులు అవినీతికి పాల్పడిన సిబ్బంది వేతనాల్లో కోత విధించడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి చెందాల్సిన రూ.కోట్లు రాకుండా పోతున్నాయి. తొమ్మిది విడతల్లో జరిగిన సామాజిక తనిఖీల ఆధారంగా బయటపడిన అవినీతి, అక్రమాలు, రికవరీపై ’సాక్షి’ ఫోకస్‌..– వివరాలు 2లోu

ఇందూరు : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 721 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,302 ఆవాస ప్రాంతాల్లో 4,67,858 మంది ఉపాధి కూలీలకు జాబ్‌ కార్డులు ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏటా సగటున రూ.300 కోట్ల పనులు జరుగుతాయి. గడిచిన దశాబ్దకాలంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సామాజిక తనిఖీల్లో రూ.4.08 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు తేల్చగా.. ఇప్పటివరకు రూ.1.77 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. సామాజిక వనరుల కోసం చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి జరగడం, పనుల్లో నాణ్యత లోపించడం, చేయని పనులు చేసినట్లుగా చూపి బిల్లులు పొందడం, ఉపాధి కూలీల సొమ్ము నొక్కెయడం జరిగింది. 2015లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఓ స్వతంత్య్ర పరిశోధన సంస్థ చేపట్టిన సర్వేలో 50 శాతం ఉపాధి హామీ లబ్ధిదారులు తమ వేతనాలు, వసూల్‌కు లంచాలు చెల్లిస్తున్నానే ఆశ్చర్యకర విషయం బయటపడింది. జరగని పనులు జరిగినట్లు, చనిపోయిన వారిని ఉపాధి కూలీలుగా చూపడం, సామాజిక తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడం వంటి కారణాలతో ప్రజాధనం పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతుంది. ఇదిలా ఉండగా గత దశాబ్దకాలంగా ఉపాధి హామీలో జరిగిన అవినీతి, అక్రమాల్లో పైస్థాయి ఉద్యోగులు ఎవరినీ విధుల నుంచి తొలగించ లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 133 మంది విధుల నుంచి తొలగించారు. తొలగించిన వారిలో ఏపీఓ, ఈసీ, టెక్నికల్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, సీఓలు మాత్రమే ఉన్నారు. మండల స్థాయిలో సరిగ్గా పర్యవేక్షణ జరపాల్సిన ఎంపీడీలు.. తప్పు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు 13 మంది ఎంపీడీఓలు తప్పు చేసినా.. వారికి ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌ జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

ఫలితాలు లేని తనిఖీలు
ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల పురోగతి నాణ్యత పరిమాణాలు చూడ్డానికి జరుగుతున్న సామాజిక తనిఖీలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఆ ఏడాది చేసిన పనులను పరిశీలించిన తరువాత చివరి రోజు జరిగే ప్రజావేదికకు ప్రజలే లేకుండా పోతున్నారు. అలాగే సామాజిక తనిఖీల ద్వారా జరిగిన అవినీతి కూడా బయటకు రావడం లేదు. 10వ తరగతి, ఇంటర్‌ చదివిన వారితో తనిఖీలు చేయించడం వల్ల కూడా అక్రమాలు వెలుగులోకి రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. మరో పక్కా సామాజిక తనిఖీలకు విచ్చల విడిగా ఖర్చు అవుతోంది. అవినీతి సొమ్మును సిబ్బంది నుంచి కక్కించే ప్రయత్నం అధికారులు చేయడం లేదు. రెవెన్యూ రికవరీ చట్టం ఉన్నా అది పదును లేని ఆయుధంగా మారింది.

మరిన్ని వార్తలు