పాడుబుద్ధికి 10 నెలల జైలు

4 Mar, 2017 23:28 IST|Sakshi
పాడుబుద్ధికి 10 నెలల జైలు

బాలుడి కిడ్నాప్‌ కేసులో కటకటాలు

గోపాలపట్నం: గంజాయి వ్యసనం ఓ వ్యక్తిని కిడ్నాప్‌కి ప్రేరేపించింది. సొంత మేనమామే ఓ బాలుడిని ఆడిస్తున్నట్లుగా నటించాడు. తల్లి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి ఆ బాలుడిని రైల్వేస్టేషన్‌లో వదిలేశాడు. గంజాయి మత్తులో పడి ఎటో వెళ్లిపోయాడు. పోలీసుల అప్రమత్తతతో ఆ బాలుడు దొరికాడు. ఆ నిందితుడు ఇపుడు కటకటాల పాలయ్యాడు. పెందుర్తికి చెందిన డోలా కిరణ్‌కుమార్‌ అనే వ్యాను డ్రైవరు మద్యం, గంజాయికి బానిసయ్యాడు. గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న తన సోదరి బోనెల విజేత ఇంటికి గత నవంబరు 18న వచ్చాడు. ఆమె రెండున్నరేళ్ల కొడుకు తిలక్‌ని ఆడిస్తూ.. పెందుర్తిలో ఉన్న తన అమ్మ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. బాలుడిని బైక్‌పై తీసుకెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైకుంఠరావు నేతృత్వాన ఎస్‌ఐ దుంపల శ్రీనివాస్‌ ఆగమేఘాలమీద నాలుగు బందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.

వాట్స్‌యాప్‌లలో అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఇన్‌చార్జిలకు నిందితుడి ఫొటోలు, బాలుడి ఫొటోలూ పంపారు. చివరకు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆ మర్నాడు వేకువజామున రిజర్వేషన్‌ కౌంటర్లో అనుమానంగా తిరుగుతున్న కిరణ్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. మైకంలో రోడ్డు పక్కన ఉన్న చుక్కా చిట్టమ్మ అనే వృద్ధురాలి ఒడిలో తిలక్‌ని పెట్టానని చెప్పాడు. ఆ వృద్ధురాలి అడ్రసు గాలించి మధురవాడలో వాంబే కాలనీలో పట్టుకున్నారు. ఇలా తిలక్‌ని తీసుకుని కుటుంబసభ్యులకు అందజేశారు. కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ కేసులో రెండవ మెట్రోపాలిటన్‌ మెజిస్రేట్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. కిరణ్‌కుమార్‌కి పది నెలల జైలు, రెండువేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు