ఆ డబ్బెవరిది?

27 Dec, 2016 02:32 IST|Sakshi
ఆ డబ్బెవరిది?

నాలుగు రోజులు.. రూ.43 కోట్లు..
డీసీసీబీ డిపాజిట్‌లపై నాబార్డు ఆరా..
విచారణ చేపట్టిన ఉన్నతాధికారుల బృందం


నిజామాబాద్‌ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లపై నాబార్డు ఉన్నతాధికార బృందం విచారణ చేపట్టింది. డిపాజిట్ల మాటున బ్లాక్‌ మనీని.. వైట్‌గా మార్చుకున్నారా? అనే దానిపై ఆరా తీసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలోని కో–ఆపరేటివ్‌ బ్యాంకులను సందర్శించి డిపాజిట్లపై విచారణ చేపట్టింది. సుమారు మూడు రోజుల పాటు విచారణ జరిగింది. రూ.రెండు లక్షలు, అంతకు మించి డిపాజిట్‌ చేసిన ఖాతాలపై ఆరా తీసింది.

అలాగే పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన ఖాతాలకు కేవైసీ ఉందా? లేదా? అనే కోణంలో విచారణజరిపింది. రూ.50 వేలకు మించి చేసిన డిపాజిట్లకు పాన్‌కార్డు జత చేశారా? వంటి అంశాలను పరిశీలించింది. డిపాజిట్ల సేకరణలో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిగింది. రాజకీయ నేతల పాలనలో నడుస్తున్న ఈ కో–ఆపరేటివ్‌ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని, వైట్‌గా మార్చారనే ఆరోపణలు పలు రాష్ట్రాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమవైన ఆర్బీఐ విచారణ చేపట్టాలని నాబార్డును ఆదేశించింది. ఈ మేరకు నాబార్డు ఉన్నతాధికార బృందం జిల్లాలో విచారణ జరిపింది.

రాష్ట్రంలో ఎక్కువ డిపాజిట్లు..
రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 41 కో–ఆపరేటివ్‌ బ్యాంకులున్నాయి. వీటిలో సుమారు 1.30 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిమానిటైజేషన్‌ నేపథ్యంలో ఇతర బ్యాంకుల మాదిరిగా కో–ఆపరేటివ్‌ బ్యాంకులకు పాతనోట్ల ఎక్చే ్సంజీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి అనుమతి ఇవ్వలేదు. కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకునేందుకు వీలు కల్పించింది. గత నెల 9, 10, 11, 12 తేదీల్లో నాలుగు రోజులు మాత్రమే డిపాజిట్లు తీసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ 13వ తేదీ నుంచి ఈ డిపాజిట్ల స్వీకరణకు కూడా బ్రేకు వేసింది. ఈ నాలుగు రోజుల్లోనే జిల్లాలో సుమారు రూ.43 కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చాయి. దీంతో ఇలా ఇతర జిల్లాల్లోని కో–ఆపరేటివ్‌ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు రావడంతో ఆర్బీఐ నాబార్డును విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా నాబార్డు బృందం ఈ డిపాజిట్లపై ఆరా తీసింది.

ఇందులో ఏమైనా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చారా? అనేక కోణంలో ఆరా తీయడం సహకార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకుల్లో నామమాత్ర డిపాజిట్లపై విచారణల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం పలు ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనం మార్చుకునేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు యథేచ్ఛగా నల్ల కుబేరులకు సహకరించారనే అభిప్రాయం ఉంది. పాత నోట్ల మార్పిడితో పాటు, డిపాజిట్ల సేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు