బాబు, వెంకయ్యల నైతిక ఓటమి : కత్తి పద్మారావు

5 May, 2016 20:28 IST|Sakshi

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడకపోవడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదని, ఈ విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైతికంగా ఓటమి చెందారని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విభజన సమయంలో  రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు నేడు కేంద్రంలో కీలక పాత్రలో ఉండి మొండిచెయ్యి చూపించడం ఆశ్యర్యానికి గురిచేస్తుందన్నారు. తెలుగుజాతిని ఐక్యం చేసి అఖిలపక్షంలో పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. వామపక్ష సభ్యులందరూ తెలుగువారే అయినప్పటికీ, వారందర్నీ కలుపుకొని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎందుకు యుద్ధంచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో వామపక్షాలతో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడెందుకు వారితో కలిసి వెళ్లరని ప్రశ్నించారు.

విపక్ష ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడంతో అపకీర్తిపాలైన చంద్రబాబు ప్రత్యేకహోదా రాకపోవడంతో చరిత్రహీనుడయ్యే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రాంతీయ, కుల, మతాలను రెచ్చగొడుతుందని, అందులోభాగమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమన్నారు. ఇందులో మొదటి ముద్దాయి వెంకయ్యనాయుడు కాగా, రెండవ ముద్దాయి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరిగా ఇవ్వాలని, అన్ని రాజకీర పార్టీలు ఈ డిమాండ్‌ను కొనసాగించాలని పద్మారావు సూచించారు.

 

మరిన్ని వార్తలు