ఆశే బతికించింది!

8 Apr, 2017 18:24 IST|Sakshi
ఆశే బతికించింది!
► నాడు సాక్షి కథనంతో స్పందించిన దాతలు
► 95 శాతానికి పైగా రికవరీ
► మరికొంత సాయమందిస్తే పూర్తిగా కోలుకునే అవకాశం
 
క్యాన్సర్‌ను జయించిన ప్రేమజంట -- వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు అయ్యాక ఆమెకు రొమ్ముక్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే   పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయిందని  తమ వల్ల కాదంటూ వారు వెనక్కి పంపించారు.  కానీ ఆమె భర్త మొక్కవోని ధైర్యంతో అత్యాధునిక సౌకర్యాలున్న ఆసుపత్రులన్నీ తిరిగాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా భార్యను బతికించుకోవాలని భర్త పడుతున్న తాపత్రయం చూసి ‘ఆశే బతికిస్తోంది’ అనే శీర్షికన ‘సాక్షి’  గత ఏడాది కథనం ప్రచురించింది.  స్పందించిన దాతలు అందించిన భారీ విరాళాలతో చావు అంచుల నుంచి దాదాపుగా ఆమె బయటపడింది. ఎవరైనా మరికొంత సహాయమందిస్తే ఆమె పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది.
 
కర్నూలు: నగరంలోని బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ అజీజ్‌ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సైదా అలియాస్‌ వై.జయంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి ఇద్దరు పిల్లలు జన్మించాక ఆమెకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను బతికించుకోవడానికి అబ్దుల్‌ అజీజ్‌ చేయని ప్రయత్నం లేదు. రొమ్ములు రెండు పూర్తిగా క్యాన్సర్‌తో పాడైపోయిన పరిస్థితుల్లో అజీజ్‌ స్వయంగా ఆమెకు సేవలు చేస్తూ వచ్చారు. ఆమె దీనగాథను గత ఏడాది జూన్ 3వ తేదిన ‘ఆశే బతికిస్తోంది’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది.
 
స్పందించిన దాతలు

భారీగా విరాళాలు ఇచ్చి ఆదుకున్నారు. అజీజ్‌కు శంకరాస్‌ బీఈడీ కళాశాల విద్యార్థులు ప్రదీప్, మధుబాబు, రాజు, శ్రీకాంత్‌ చేదోడుగా నిలిచారు. వారి సహాయంతో జిల్లాలోని కర్నూలుతో పాటు బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు, కోసిగి, కోవెలకుంట్లలోని కళాశాలలు, పాఠశాలలు తిరిగి విరాళాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మొత్తం రూ.30లక్షల దాకా విరాళాలు సమకూరాయి.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్యం
 
సేకరించిన విరాళాలను తీసుకొని అజీజ్‌ తిరగని కార్పొరేట్‌ ఆసుపత్రి లేదు. బెంగళూరులో కిడ్వాయ్‌ హాస్పిటల్‌లో, బళ్లారి క్యాన్సర్‌ హాస్పిటల్‌లో, హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌లో, యశోదా హాస్పిటల్‌లో, ఒమెగా హాస్పిటల్‌లో ఖరీదైన పలు రకాల కీమోథెరపీ చికిత్సను అందించారు. చివరకు కిమ్స్‌ హాస్పిటల్లో చేరడంతో అక్కడి కేరళ వైద్యుడు ప్రదీప్‌ ఆధ్వర్యంలో సైదాకు రొమ్ము క్యాన్సర్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఇప్పటికే రూ.30లక్షల దాకా ఖర్చు పెట్టారు.

ఆమె పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స, మందులకు కలిపి రూ.8లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. భార్య ఆరోగ్యం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న భర్త అబ్దుల్‌ అజీజ్, దాతల సహకారంతో చావు అంచులకు చేరిన సైదా నేడు క్యాన్సర్‌ను జయించి కోలుకుంది. దాతలు మరికొంత తనిస్తే ఆమె పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని భర్త అజీజ్‌ కోరుకుతున్నారు. 
 
బ్యాంకు అకౌంట్‌ వివరాలు
సైదా
భర్త: అబ్దుల్‌ అజీజ్‌
ఆంధ్రాబ్యాంక్, కొత్తబస్టాండ్‌ బ్రాంచ్,
కృష్ణాకాంప్లెక్స్, కర్నూలు.
అకౌంట్‌ నెంబర్‌ ః 1107101001664
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ః ఏఎన్డిబి0001107 
మరిన్ని వార్తలు