పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవు

13 Dec, 2016 23:35 IST|Sakshi
పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవు

వేముల : కస్తూర్బా పాఠశాలలో వర్గాలుగా ఏర్పడి విద్యార్థినుల చదువుతో ఆడుకోవద్దని, ఇకపై పద్ధతి మార్చుకుని బోధనపై దృష్టి పెట్టాలని గర్ల్‌ చైల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫీసర్‌(జీసీడీవో) ప్రమీల ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం సాక్షి దిన పత్రికలో ’కస్తూర్బా పాఠశాల ఘటనలో తప్పెవరిది’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ప్రమీల మంగళవారం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయినులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సిబ్బందిలో లుకలుకలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇకపై ఏ సంఘటనలు జరిగినా సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థినుల చదువుతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని చెప్పారు.
ఇన్‌చార్జి ఎస్‌వోగా హెప్సీబా  : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఇన్‌చార్జి స్పెషలాఫీసర్‌గా హెప్సీబా నియమించినట్లు ప్రమీల తెలిపారు. పాఠశాలలో జరిగిన ఘటనతో ఇక్కడ ఎస్‌వోగా పనిచేస్తున్న ఉమాదేవిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హెప్సీబాను ఇన్‌చార్జి ఎస్‌వోగా నియమిస్తూ ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటసుబ్బయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు