పాఠం.. ఇక ఏకరూపం

23 Nov, 2015 01:06 IST|Sakshi
పాఠం.. ఇక ఏకరూపం

సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలే ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను మార్పు చేసుకునేవి. ఇప్పుడు కేంద్రమే వీటిని జాతీయస్థాయిలో ఒకేలా ఉంచేందుకు కసరత్తు చేపట్టింది. ప్రధానంగా సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులన్నీ రాష్ట్రాల బోర్డులు, కేంద్రీయ బోర్డుల్లోనూ ఏకరూపంలో ఉండాలని నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్/12వ తరగతి వరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఒకే రకమైన సిలబస్‌తో ఆధారిత పుస్తకాలను తీసుకురావాలని పేర్కొంది. ఈ బాధ్యతను జాతీయ ఉపాధ్యాయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది. దీంతో ఎన్‌సీఈఆర్‌టీ అన్ని రాష్ట్రాల రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల (ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులతో ఢిల్లీలో సమావేశమైంది.

పుస్తకాల్లోని అంశాలే కాకుండా పాఠ్యపుస్తకాల నాణ్యత కూడా ఒకేలా ఉండేలా మార్పులు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోనూ విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 8, 9, 10 తరగతులు, ఇంటర్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను జాతీయస్థాయిలో పరీక్షలకు అనుగుణంగా మార్పు చేశారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు పుస్తకాల్లో మార్పులపై కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తరహాలో సిలబస్‌లో మార్పులు చేస్తోంది.

 11 విభాగాల్లో మార్పులు అవసరం
 పాఠ్య పుస్తకాల్లో ప్రధానంగా 11 విభాగాలకు చెందిన వివిధ అంశాల్లో మార్పులు అవసరమని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. ఉదాహరణకు ఒకటి, రెండు తరగతుల్లో గణితం సబ్జెక్టుకు సంబంధించిన విభాగాలు, అంశాలు, పుస్తక నిర్మాణం ఎలా ఉండాలన్న విషయాలను స్పష్టంగా వివరించింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుస్తకాలు ఎలా ఉన్నాయి.. వాటిల్లో ఏయే మార్పులు చేయాలో స్పష్టం చేసింది.

11 రకాల విభాగాలు ఇవే..
 1. జనరల్ ఇన్ఫర్మేషన్: తరగతి, పేరు, రచయిత, పబ్లికేషన్, పేజీలు, పాఠాలు, రివ్యూలు, పుస్తకం ధర.
 2. పుస్తక స్వరూపం: ఇందులో పేపరు నాణ్యత, బైండింగ్, కవర్‌పేజీ, ముద్రణ నాణ్యత, ఫాంట్ సైజ్, లేఅవుట్, పుస్తకంలో కాన్సెప్టులు, ప్రాబ్లం సాల్వింగ్, లాజికల్ ఆర్గ్యుమెంట్, కమ్యూనికేషన్ అంశాలు.
 3. కంటెంట్ ఆర్గనైజేషన్: వాస్తవ అంశాలు, విధానాలు. అదనపు సమాచారం. విధానాల సమగ్రత. గణితం టెర్మినాలజీ.
 4. విద్యార్థి కేంద్రీకృత యాక్టివిటీస్: యాక్టివిటీస్ విద్యార్థి నిత్య జీవితంలో చూసినవై ఉండాలి. పుస్తకాల్లో చదివిందే కాదు వాటిని మించి ఆలోచించగలిగేలా ఉండాలి.
 5. ప్రశ్నల విధానం: రీజనింగ్ ఆధారిత, యాక్టివిటీ ఆధారిత, సమస్యాపూరక, సృజనాత్మకంగా, లోపాలను గుర్తించేలా ఉండాలి.
 6. విజువల్స్: కనిపించే బొమ్మల్లో స్పష్టత. వాటి స్టైల్. పాఠ్యాంశంతో బొమ్మల అనుసంధానం, రంగులు, లేఅవుట్.
 7. ఆసక్తి పెంచేవి: ఆయా అంశాల్లో విద్యార్థుల ముందుండే చాలెంజెస్, అందులో విద్యార్థి స్వయంగా పాల్గొనేలా చేయడం. సృజనాత్మకంగా, సొంతంగా ఆలోచించేలా చేసేవి. టెక్నాలజీని వినియోగింపజేసేవి.
 8. టీచర్స్ సపోర్ట్: పాఠ్య పుస్తకాల వినియోగ మార్గదర్శకాలు, భాషా మార్గదర్శకాలు. కంటెంట్ కేంద్రీకృత సమాచారం. బొమ్మలు, ఇతర గ్రూపులతో చర్చించడం, బోధన సామగ్రి వినియోగం.
 9. నేషనల్ కన్సర్న్: లౌకికత్వం, ఐకమత్యం, పరస్పర మర్యాద, విలువలు, మానవత్వం. రాజ్యాంగ విలువలు, స్త్రీపురుష సమానత్వం.
 10. భాష: పాఠ్యాంశాల్లో విద్యార్థి వయసు మేరకు భాష ఉండాలి.
 11. ఇతర అంశాలు: వర్క్‌బుక్, ఇతర మెటీరియల్, రెఫరెన్స్, నేర్చుకునే విధానం.

>
మరిన్ని వార్తలు