పాత పద్ధతిలోనే ‘గ్రూప్స్‌’ పరీక్షలు నిర్వహించాలి

10 Sep, 2016 22:41 IST|Sakshi
బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య

దోమలగూడ: ప్రభుత్వం గ్రూప్‌–1, 2, 3 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు అన్‌లైన్‌లో కాకుండా పాత పద్ధతినే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. లేదంటే సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయన్ని ముట్టడించి చైర్మన్‌ను కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద ఏపీ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరుద్యోగులు ధర్నా చేశారు.

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ 2కు మల్టీ సెషన్స్‌ పద్ధతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. దీని వల్ల ఐదేళ్లుగా పాత పద్ధతిలో సిద్ధమవుతున్న వారికి అన్యాయం జరుగుతుందన్నారు. సంస్కరణలు, మార్పులను రెండు, మూడేళ్ల ముందే ప్రకటించి, అభిప్రాయాలు సేకరించాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే గ్రూప్‌ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అదే విధానం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండున్న ఏళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయక పోవడం దారుణమైన మోసమని విమర్శించారు. ధర్నాలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాసు తదితరులు మాట్లాడారు.


 

మరిన్ని వార్తలు