ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న వివాదం

30 Aug, 2016 00:23 IST|Sakshi
వర్ధన్నపేట : ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణంపై వివాదం కొనసాగుతోంది. రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదంతో రెవెన్యూ అధికారులు ముదిరాజ్‌ కులపెద్దలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలోని ఐనవోలు గ్రామంలోని సర్వే నెం. 993లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోని 20 గుంటల స్థలంలో ముదిరాజ్‌లు పెద్దమ్మతల్లి గుడి నిర్మించడానికి 2012లో అప్పటి ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, జెడ్పీటీసీ సభ్యుడు మార్నేని రవీందర్‌రావు భూమి పూజ చేశారు. అయితే, తాజాగా ఐనవోలు మండలంగా ఏర్పాటుకానుండడంతో ప్రభుత్వ స్థలాలకు అధికారులు హద్దులు ఏర్పాటుచేస్తున్నారు. అప్పటిలోగా అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని పూర్తి చేయాలని ముదిరాజ్‌లు సిద్ధమయ్యారు. ఈ ఆలోచనతోనే రెండు రోజుల క్రితం పెద్దమ్మతల్లి విగ్రహన్ని ప్రతిష్టించారు. దీనికి స్థానికులు అడ్డుకోవడంతో వివాదం ఆరంభమైంది. అయితే, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఆలయాన్ని నిర్మించనుండడంతో గతంలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. కాగా, గ్రామంలో రెండు రోజులుగా వివాదం కొనసాగుతుండడంతో ముదిరాజ్‌ కులపెద్దలను రెవెన్యూ అధికారులు  బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం స్వాధీనం చే సుకుని.. ఆలయ నిర్మాణంకు మరో స్థలం కేటాయిస్తామని ముదిరాజ్‌లకు నచ్చచెబుతున్నారు. 

 

మరిన్ని వార్తలు