శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

4 Jul, 2017 00:15 IST|Sakshi
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
  •  ఫ్యాక‌్షన్‌, మట్కా, పేకాట, బెట్టింగ్‌ అణిచివేతకు కృషి
  • నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌
  •  
    అనంతపురం సెంట్రల్‌ :  జిల్లాలో ప్రణాళికా బద్ధంగా పనిచేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తానని నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అశోక్‌కుమార్‌ మాట్లాడారు.
     
    దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమిదేనని చెప్పారు. ఈ ఏడాది పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జిల్లాలో మొదటి నుంచి ఫ్యాక‌్షన్‌ , భూ తగాదాలు ఎక్కువేనన్నారు. అలాంటి గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.
     
    జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మట్కా , పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ లాంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా 7వ స్థానంలో ఉందని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.  మైనర్‌ బాలికల మిస్సింగ్‌ కేసులు అధికంగా ఉన్నాయని నివేదికలను బట్టి తెలుస్తోందని, కారణాలను అన్వేషించి చర్యలు తీసుకుంటామన్నారు.
     
    అలాగే ప్రజలతో పోలీసులు సఖ్యతగా మెలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పోలీసు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటిని కొనసాగిస్తూనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
     
మరిన్ని వార్తలు