ఆ లడ్డూ..ఎందుకు పెట్టనట్టు!

8 Sep, 2016 07:11 IST|Sakshi
మహా గణపతి పాదాల చెంత 500 కిలోల లడ్డూ

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ గణపతి మహా ప్రసాదం ఈ ఏడాది భక్తులకు ‘చేరువ’యింది. ఏటా 50 అడుగుల ఎత్తులో లంబోదరుడి చేతిలో దర్శనమిచ్చే ప్రసాదం ఈ ఏడాది పాదాల చెంతనే ఉంచారు. 500 కిలోల లడ్డూను చేతితో తాకుతూ నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న భక్తుల మదిలో ఓ వైపు ఆనందం ఉన్నా.. గణపతి చేతిలో లడ్డూను ఎందుకు పెట్టలేదనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు ఈ ఏడాది మహా గణపతికి 500 కేజీల లడ్డూను ప్రసాదంగా సమర్పించేందుకు సోమవారం ఉదయం తీసుకువచ్చారు. పూజ ల అనంతరం లడ్డూను గణపతి చేతిలో అమర్చేందుకు క్రేన్‌ను సిద్ధం చేశారు. క్రేన్‌కు లడ్డూను అమర్చారు. క్రేన్‌ ఆపరేటర్‌కు సిగ్నల్‌ అందడంతో లడ్డూను పైకి లేపి వినాయకుడి చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. అంత వరకూ గాలిలో ఉన్న మహా ప్రసాదాన్ని చూస్తున్న భక్తులకు అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. ఏమైందో లడ్డూ ప్రసాదం గణపతి చేతిలోకి బదులు పాదాల చెంతకు చేరింది. ఎందుకిలా జరిగింది..? అని కమిటీ ప్రతినిధుల్ని అడిగితే మౌనమే సమాధానమైంది.

ఎల్‌ఈడీ ఛత్రం లేదు..
ఏటా వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేందుకు వీలుగా లడ్డూపై ఎల్‌ఈడీ ఛత్రాన్ని అమర్చేవారు. కానీ ఈసారి మహా గణపతి పాదాల చెంత ఉంచిన 500 కిలోల లడ్డూకు కేవలం పాలిథిన్‌ కవర్‌ మాత్రమే కప్పి         వదిలేశారు.

ప్రహసనం.. ప్రసాద వితరణ
ఖైరతాబాద్‌ గణపతి లడ్డూ ప్రసాదమంటే భక్తులకు మహా క్రేజ్‌. మూడేళ్లుగా ప్రసాదం పంపిణీ ప్రహసనంగా మారుతోంది. ఈ ప్రసాదానికి సాయుధ పోలీసుల కాపాలా ఉంచాల్సి వస్తోంది. ప్రసాదం పంచే రోజు భక్తుల రద్దీని అదుపుచేయలేని పరిస్థితులూ ఉన్నాయి. దీంతో ప్రసాద వితరణ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఏడాది ప్రసాదం సైజు తగ్గిపోవడానికి, చేతిలో ఏర్పాటు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమని చెబుతున్నారు.

పంపిణీపై లేని క్లారిటీ..
మహా నైవేద్యానికి తొలి ఐదు రోజులు పూజ తప్పనిసరి అని, తరువాతే ప్రసాద పంపిణీ అని ఉత్సవ కమిటీ చెబుతోంది. పంపిణీ ఎప్పుడు ఎక్కడ అనే విషయాలపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఉత్సవ కమిటీ ప్రకటన కోసం ప్రసాదాన్ని ఆశిస్తున్న భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొసమెరుపు..
బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్‌కు చెందిన శ్రీధర్‌ అనే భక్తుడు 15 కేజీల లడ్డూను మహా గణపతికి సమర్పించారు. ఈ నైవేద్యాన్ని ఖాళీగా ఉన్న లంబోదరుడి చేతిలో ఉంచారు.



 

మరిన్ని వార్తలు