లాభాల లెక్క తేలాకే ఎన్నికలు నిర్వహించాలి

28 Aug, 2016 22:54 IST|Sakshi
మాట్లాడుతున్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య
  •  ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య
  • శ్రీరాంపూర్‌ : సింగరేణి గత సంవత్సరం సా«ధించిన లాభాల నుంచి కార్మికులకు వాటా చెల్లించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు నెల పూర్తవుతున్న ఇప్పటికీ లాభాల లెక్క చెప్పలేదని దాని వాటాను కూడా ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. ఎన్నికల తర్వాతే లాభాల వాటా జోలికి వెళ్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో 10 శాతం వాటా పెరిగితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేవలం 1 శాతం మాత్రమే వాటా పెరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చే సినా పనికాలేదన్నారు. 62 వేల మంది సమ్మె చేస్తే కేవలం 33 వేల మందికే వేతనాలు ఇచ్చారన్నారు. కోలిండియా ఎలాంటి డబ్బులు లేకుండా పోస్టు రిటైర్మెంట్‌ మెడికల్‌ స్కీం అమలు చేస్తోందని, దీన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె ఉందని ఇందులో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్మిక చట్టాల సవరణ, అధిక ధరలు, ఎఫ్‌డీఐలను నిలిపివేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ. 18 వేల వేతనం, ఇంకా 11 డిమాండ్లపై సమ్మె జరుగుతుందన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం 30న దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారని,, సింగరేణిలో కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి సెక్రెటరీ ల్యాగల శ్రీనివాస్, సీపీఐ నియోజకవర్గం కార్యదర్శి కలవేని శ్యాం, నాయకులు భీంరాజు, కృష్ణమూర్తి, సంఘం సదానందం, రాజనర్సు పాల్గొన్నారు. 
     
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు