ఇకనైనా బకాయిలు ఇవ్వండి

7 Dec, 2015 00:11 IST|Sakshi
ఇకనైనా బకాయిలు ఇవ్వండి

కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి
♦ రూ.47వేల కోట్లకు మరోసారి అభ్యర్థనలు
♦ 4 నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
♦ ఏ నెలకానెలా బొటాబొటిగా సరిపోతున్న ఆదాయం
 
 సాక్షి, హైదరాబాద్: తమకు రావాల్సిన బకాయిలను త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ఏడాదిగా పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను మరోమారు ఏకరవు పెట్టింది. వివిధ అంశాలపై దాదాపు రూ.47 వేల కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ప్రతిపాదనలను పంపింది. కరువు సాయంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, సీఎస్‌టీ బకాయిలు, బడ్జెట్ సాయం, ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టు పేరిట ఈ నిధులను కోరింది. రాష్ట్ర ఆదాయం ఏ నెలకానెలా బొటాబొటిగా సరిపోతుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భారీ పథకాలకు నిధుల కటకట నెలకొంది. మరోవైపు కేంద్రం నుంచి ఆశించినంత సహకారం లేకపోవటం అశనిపాతంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నాలుగు నెలలే ఉంది. ఈలోగా తమకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలని రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది.

 కనీస ప్యాకేజీ ఇవ్వండి
 వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు ప్రతిపాదనలు పంపించింది. రూ.35వేల కోట్లకుపైగా ఉన్న దీన్ని నీతి ఆయోగ్ సూచనల మేరకు రూ.30,571 కోట్లకు సవరించింది. ఇటీవలే ఏపీలో వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున కేంద్రం రూ.350 కోట్లు విడుదల చేసింది. కానీ తెలంగాణ ఊసెత్తలేదు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా ఈ ప్యాకేజీని గుర్తు చేయటంతో పాటు రూ.1,000 కోట్లు తక్షణ సాయంగా ఇవ్వాలని కోరారు.

 ఏడాదిగా సీఎస్‌టీ బకాయిలు
 కేంద్రం నుంచి రూ.7,182 కోట్ల సీఎస్‌టీ బకాయిలు రావాల్సి ఉంది. బకాయిల్లో మూడో వంతు నిధులు చెల్లిస్తామని కేంద్రం మార్చిలోనే హామీ ఇచ్చినా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టుకు రూ.407 కోట్లు కావాలంటూ ఇటీవలే నీతి ఆయోగ్ నుంచి ఆర్థిక సాయం కోరింది.

 తప్పిన కేంద్ర సాయం అంచనాలు
 ఈ ఏడాది కేంద్రం నుంచి వివిధ గ్రాంట్లు, పన్నుల ద్వారా మొత్తం రూ.25,223 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించింది. కేంద్రం నుంచి పన్నుల వాటా పెరిగినప్పటికీ రాష్ట్రానికి వచ్చే నిధుల శాతం తగ్గటంతో రాష్ట్రం రూ. 2,389 కోట్లు నష్టపోయింది. మరోవైపు కేంద్ర పథకాలకయ్యే ఖర్చులో రాష్ట్ర వాటాను పెంచడం అదనపు భారమైంది. ఈ నేపథ్యంలో పన్నుల వాటాను మినహాయించి బడ్జెట్‌లో అంచనా వేసుకున్నట్లుగా తమకు రావాల్సిన రూ.6,653 కోట్లు విడుదల చేయాలని లేఖ రాసింది. వీటితో పాటు కరువు దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో రూ.2,514 కోట్ల సాయం కోరింది.

మరిన్ని వార్తలు