వరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి

18 Oct, 2015 02:31 IST|Sakshi
వరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కేవలం రూ. 10 మాత్రమే పెంచిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్టేట్ బోనస్‌ను ప్రకటించాలని ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇంత తక్కువగా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు.  పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాలు వరి ధాన్యం మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ. 200 నుంచి రూ. 250 వరకూ బోనస్ ప్రకటించాయని, ఏపీలో కూడా అలాగే ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూ తుళ్లూరులో తాత్కాలికంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి రూ.కోట్లు ఖర్చు చేయడం ఎందుకని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

 కేసీఆర్‌ను వ్యక్తిగతంగా వెళ్లి పిలుస్తానన్నారే.: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును రాజధాని శంకుస్థాపనకు తానే వ్యక్తిగతంగా ఈ నెల 18న వెళ్లి ఆహ్వానిస్తానన్న సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత  జగన్‌మోహన్‌రెడ్డిని తానే వ్యక్తిగతంగా ఆహ్వానిస్తానని ఎందుకు చెప్పలేదని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోమని జగన్ ప్రకటించిన తరువాత కూడా ఆయన్ను ఆహ్వానించడానికి మంత్రులను పంపుతున్నారన్నారు. ఏడు రోజుల నిరాహారదీక్ష తరువాత జగన్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారనే విషయాన్ని తమ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా వెల్లడించారన్నారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనపై ఇప్పటికీ ప్రతిపక్ష నేతకు సమాచారమే అందజేయలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు