మాండలికంతో ప్రజలకు చేరువైన కథ

12 Nov, 2016 23:26 IST|Sakshi
మాండలికంతో ప్రజలకు చేరువైన కథ

కడప కల్చరల్‌:
కథల్లో మాండలికం చేరినప్పటి నుంచి అది ప్రజలకు దగ్గరవుతోందని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుభాష మిత్రమండలి, కేంద్ర సాహిత్య అకాడమి బెంగుళూరు శాఖ సహకారంతో శనివారం స్థానిక సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో సాహితీ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆచార్య రాచపాలెం మాట్లాడుతూ 'సీమ' కథకుల్లో నేడు ప్రజల భాష చోటుచేసుకుంది గనుకనే ప్రజలకు దగ్గరవుతోందన్నారు. మునుపటి కంటే ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. మాండలికాల వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నేటి రచయితలు ఎక్కువగా ప్రాంతీయకతకు ప్రాధాన్యత ఇస్తుండడం శుభ పరిణామమమన్నారు. చిత్తూరు జిల్లా కథానిక–భాష అంశంపై మాట్లాడిన ఆచార్య రాజేశ్వరమ్మ తమ జిల్లాలోని కథల్లో ఎక్కువగా జాతీయాలు, పద బంధాలు, నుడికారాలు, సామెతలు ఉంటాయని సోదాహరణంగా వివరించారు. అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రముఖ కథా రచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ నేటితరం రచయితల్లో మాండలిక ప్రయోగం పుష్కలంగా ఉందని ఆయన వివరించారు. కర్నూలుజిల్లాకు సంబంధించి డాక్టర్‌ ఎం.హరికిషన్‌ మాట్లాడుతూ తమ జిల్లాలోని రచయితలు మాండలికాన్ని తక్కువగా ఉపయోగిస్తారని, శిష్ట వ్యవహారికమే ఎక్కువగా వాడతారని తెలిపారు. వైఎస్సార్‌ జిల్లాకు సంబంధించి డాక్టర్‌ జీవీ సాయిప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లోని రచయితలు వాడే భాషతో వారి కథలు విశేష ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. సరిహద్దుల్లో మాండలికం బలంగా కనిపిస్తోందని, పాత్రోచితంగా దాన్ని వాడడంతోనే కథలు మంచి పేరు పొందుతున్నాయన్నారు. సదస్సు సంచాలకులు డాక్టర్‌ అణుగూరి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ 'సీమ' భాష, పరిణామం, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. భాషాభివృద్ధికి సాహిత్య అకాడమి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు