రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం

22 Jun, 2016 20:22 IST|Sakshi

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ బుధవారం క్వింటాల్ పత్తికి కు గరిష్టంగా రూ.6,021 పలికింది. జమ్మికుంట మార్కెట్‌కు కరీంనగర్, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు 1,210 క్వింటాళ్ల పత్తిని బుధవారం తీసుకురాగా, వ్యాపారులు మోడల్ ధర రూ.5,500, కనిష్ట ధర రూ.4,500 చెల్లించారు.

 

మూడేళ్ల క్రితం పలికిన ధర మళ్లీ ఈ సీజన్ చివరలో పలుకడంతో రైతుల్లో అనందం వెల్ల్లివిరిసింది. రాష్ట్ర స్థాయిలోనే జమ్మికుంట మార్కెట్‌లో పలికిన ధర ఈ సీజన్‌లో రికార్డుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్లకు, గింజలకు ఉహించని విధంగా డిమాండ్ పలుకుతుండడంతో వ్యాపారులు పోటీ పడి పత్తికి ధరలు చెల్లిస్తున్నారు. ఖరీఫ్‌లో పత్తి సాగు మొదలవుతున్న సమయంలో పత్తికి ధర పైపైకి పాకుతుండడంతో రైతుల్లో ఉత్సాహన్ని కలిగిస్తోంది. ఇదే మార్కెట్‌లో 2013 మార్కెట్ సీజన్‌లో పత్తి ధర రూ.6,000-6,800 వరకు పలికింది.


వరంగల్‌లో 6వేలకు చేరువలో..
వరంగల్ :  వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్వింటా పత్తి రూ.5,915 ధర పలికింది. మూడేళ్లలో ఇదే రికార్డు ధర. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ అనే రైతు ఇంతకాలం పత్తి నిల్వ చేసి, ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉండడంతో 250 బస్తాల పత్తిని మమత ట్రేడర్స్ వారి వద్దకు అమ్మకానికి తెచ్చాడు.

 

మొదటి వేలం పాటలోనే జమ్మికుంటకు చెందిన నర్సింహ ఇండస్ట్రీస్ వ్యాపారి రూ.5,915 అత్యధిక ధరతో కొనుగోలు చేశాడు. నిల్వ చేసిన పత్తి మొత్తం 108 క్వింటాళ్లు అయిందని, మార్కెట్ ఖర్చులన్నీ పోను రూ.6.40 లక్షల వచ్చాయని ఎల్లగౌడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజంటూ మిఠాయిలు కొనుగోలు చేసి మార్కెట్లో పంపిణీ చేశాడు.

 

మరిన్ని వార్తలు