ఇవేమి రహదారులు!

2 Jul, 2017 04:07 IST|Sakshi
ఇవేమి రహదారులు!

అధ్వానంగా గ్రామీణ రోడ్లు
బురదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు

కెరమెరి: రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడుతున్నా ఇక్కడ మాత్రం ఆ జాడలు కనిపించడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందే వర్షాకాలం ఆపై కచ్చా రోడ్లు ఎటూ వెళ్దామన్నా నరకయాతన అనుభవించాల్సిందే.

మండలంలో..
నిషాని గ్రామ పంచాయతీకి చెందిన దేవుడ్‌పల్లి, చింతపల్లి గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో మొత్తం 55 కుటుంబాల వరకు ఉంటాయి. 286 మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఇందాపూర్‌ వరకు బీటీ రోడ్డు ఉన్నప్పటికీ ఇందాపూర్‌ నుంచి దేవుడ్‌పల్లి వరకూ బీటీ వేయలేదు. అది కేవలం ఒక కిలో మీటరు మాత్రమే ఉన్నప్పటికీ నిధుల లేమితో ఇక్కడ పనులు నిలిచిపోయాయని సమాచారం. గతంలో చాలా సార్లు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను, నాయకులు వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు.

‘ఉపాధి’ నిధులతో కలగని మోక్షం..
గతంలో మండలానికి సుమారు కోటి రూపాయలతో ఉపాధి హామీలో రోడ్లు మంజూరయ్యాయి. కాని ఈ గ్రామాలకు  మాత్రం మోక్షం కలగలేదు. అధికారులకు గుర్తుకు రాలేదో.. మనకెందుకులే అనుకున్నారో ఏమో తెలియదు గాని బీటీ రోడ్లు మంజూరు కాలేదు. వర్షాకాలంలో రోడ్లన్ని బురదగా మారి నడిచేందుకు యోగ్యంగా లేకుండా పోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో రోడ్లపై మొరం వేసినప్పటికీ అది ఎంతో కాలం నిలవడం లేదు. వర్షం వస్తే మళ్లీ గుంతలమయంగా మారుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా పొలాలు ఉండడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. రాత్రుళ్లు రైతులు అటుగా వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తమ గ్రామాలకు మిగిలి ఉన్న రోడ్లకు బీటీ వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం
గతంలోనే ఆయా గ్రామాలకు బీటీ రోడ్ల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అయితే దేవుడ్‌పల్లి రోడ్డుకు నిషాని కనెక్ట్‌ రోడ్డు కోసం ప్రతిపాదనలు చేశాం. మరోవైపు ఆ గ్రామం పునరావాసం కింద వేరే ప్రాంతానికి వెల్లేదుంది.
– ఆత్మారాం, పీఆర్‌ఏఈ, కెరమెరి

మరిన్ని వార్తలు