నిజాయితీ చాటుకున్న యువకుడు

1 Aug, 2016 06:21 IST|Sakshi

అఫ్జల్‌గంజ్‌: ఏటీఎం సెంటర్‌లో దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో యువకుడు. అఫ్జల్‌గంజ్‌ సీఐ అంజయ్య కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన మల్లయ్య, సత్తమ్మ దంపతులు గౌలిగూడ చమన్‌ ప్రాంతంలో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 23న గౌలిగూడలోని శంకర్‌షేర్‌ హోటల్‌ సమీపంలో ఉన్న ఏటీఎం నుంచి సత్తమ్మ పేరున ఉన్న ఎస్‌బీహెచ్‌ ఖాతా నుంచి రూ.10  వేలు డ్రా చేసేందుకు మల్లయ్య యత్నించాడు. అయితే, డబ్బు రాకపోవడంతో పక్కనే ఉన్న ఐసీఐసీఐ ఏటీఎం నుంచి రూ.5 వేలు డ్రా చేశాడు.

అదే సమయంలో మొదటి ఏటీఎంలోకి వెళ్లిన యాకుత్‌పురాకు చెందిన ఇమ్రాన్‌కు అక్కడ ఏటీఎంలో రూ.10 వేలు దొరికాయి. ఆ డబ్బుకు సంబంధించిన వారు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేçÙన్‌లో అందజేశాడు. ఆ తర్వాత పాస్‌బుక్‌ అప్‌డేట్‌ చేయించుకొనేందుకు బ్యాంకుకు వెళ్లిన మల్లయ్యకు సత్తమ్మ అకౌంట్‌లో రూ.15 వేలు డ్రా చేసినట్టు బ్యాంక్‌ సిబ్బంది చెప్పారు.  దీంతో   అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఏటీఎం సెంటర్‌లో దొరికిన నగదు స్టేషన్‌లో ఉండటంతో ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య ఆ డబ్బు వారిదేనని నిర్ధారించుకొని వారికి అప్పగించారు. దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ఇమ్రాన్‌ను సీఐ అభినందిచారు.

 

మరిన్ని వార్తలు