దొంగల ఆట‘కట్‌’

29 Jul, 2016 12:01 IST|Sakshi
పరికరం పనితీరును వివరిస్తున్న గుజ్జా వెంకట్‌

► చోరీల నివారణకు ఓ పరికరాన్ని రూపొందించిన యువ ఇంజనీర్‌

భద్రాచలం టౌన్‌ :
ఇంటికి/దుకాణానికి తాళం వేసి వెళ్లారా? ఏ అర్ధరాత్రో దొంగ వస్తాడేమోనని భయపడుతున్నారా? మీ భయాన్ని పోగొట్టేందుకు తానొక పరికరాన్ని కనిపెట్టానని చెబుతున్నాడు.. భద్రాచలానికి చెందిన ఓ యువ ఇంజనీర్‌. భద్రాచలం పట్టణానికి చెందిన ఆ యువ ఇంజనీర్‌ పేరు గుజ్జా వెంకట్‌. దొంగతనం, అగ్ని ప్రమాదం జరుగుతున్నదన్న సమాచారాన్ని ఇది వెంటనే యజమానికి, సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారమిస్తుందని చెబుతున్నారు. తన పరికరం పనితీరుపై ఆయన గురువారం భద్రాచలంలో విలేకరుల సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

ఈ పరికరం పేరు ‘తెఫ్ట్‌ అండ్‌ ఫైర్‌ అలర్ట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌’. దీనికియ్యే ఖర్చు 10వేల రూపాయలు. దీనిని ఇల్లు, షాపు.. ఇలా ఎక్కడైనా అమర్చుకోవచ్చు. ఈ పరికరంలో మోషన్‌ డిటెక్టర్, వైర్‌లెస్‌ సీసీ కెమెరా ఉంటాయి. షట్టర్‌గానీ, తలుపు వద్దగానీ సెక్యూరిటీ బాక్స్‌ అమర్చుతారు. దానికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానిని సంబంధిత యజమానికి కేటాయిస్తారు. సమీప పోలీస్‌ స్టేషన్‌లో ట్యాబ్‌ ఏర్పాటు చేస్తారు. పరికరం అమర్చిన షాపునకుగానీ, ఇంటికిగానీ దొంగలు వచ్చిన వెంటనే పరికరంలోని సీసీ కెమెరా ఫొటోలు తీస్తుంది. ఆ వెంటనే మోషన్‌ డిటెక్టర్‌ పనిచేయడం మొదలవుతుంది. ఈ డిటెక్టర్‌ నుంచి ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోని ట్యాబ్‌కు, ఆ తరువాత యజమాని ఫోన్‌ నెంబర్‌కు సమాచారం వెళుతుంది.

పోలీస్‌ స్టేషన్‌లోని ట్యాబ్‌లో సదరు ఇంటి/షాపు వివరాలు, ప్రాంతం వివరాలు కనిపిస్తాయి. స్టేషన్‌ సిబ్బంది ఈ వివరాలను పెట్రోలింగ్‌ పోలీసులకు ఫోన్‌/వాకీటాకీ ద్వారా అందజేస్తారు. వారు సాధ్యమైనంత త్వరలో ఆ ఇంటికి/షాపుకు చేరుకుంటారు. అంతేకాదు.. పెట్రోలింగ్‌ జీపులో కూడా ట్యాబ్‌లాంటి ప్రత్యేక పరికరం అమరిస్తే.. ఇంటి/షాపులోని సీసీ కెమెరాలో నమోదవుతున్న దృశ్యాలన్నిటినీ చూడవచ్చు. అప్పుడు దొంగలను పట్టుకోవడం సులభమవుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ పరికరం ఇలాగే సందేశాలను పంపడం ద్వారా అప్రమత్తం చేస్తుంది. దీనిని ముందుగా భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, సీఐ శ్రీనివాస్‌కు వివరించినట్టు వెంకట్‌ చెప్పారు. భద్రాచలంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూద్దామని వారు చెప్పారని అన్నారు. తాను భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఖమ్మంలోని డిప్లొమా, భద్రాచలం పౌల్‌రాజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్, ఎంటెక్‌ పూర్తిచేసినట్టు చెప్పారు.

>
మరిన్ని వార్తలు