పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే చోరీ

23 May, 2017 19:36 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే చోరీ

► 28 సవర్ల బంగారం, రూ.5 వేల నగదు,
► ఒక మోటారు సైకిల్‌ అపహరణ


సింగరాయకొండ : స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఇంట్లోనే చోరీ జరిగింది. సుమారు 4.50 లక్షల రూపాయల విలువైన 28 సవర్ల బంగారం, రూ.5 వేల నగదు, మోటారు సైకిల్‌ చోరీకి గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని చుండూరివారివీధిలో నివాసం ఉంటూ కేటరింగ్‌ చేసుకుంటూ జీవించే నాగసూరి రామారావు భార్యాపిల్లలతో కలిసి ఆదివారం రాత్రి తన ఇంటి పైఅంతస్తులో పడుకుని నిద్రించాడు. కింద ఇంట్లో అనారోగ్యంగా ఉన్న అతని తల్లి పడుకుని ఉంది. ఇంటి తలుపునకు ఇనుప కటకటాలు ఉండగా, దానికి తాళం వేసి గోడకు తగిలించారు.

ఈ విషయం పసిగట్టిన దొంగలు.. సోమవారం తెల్లవారుజామున కర్ర సహాయంతో కటకటాల సందులో నుంచి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న నగలు, నగదు దోచుకుని వెళ్లే సమయంలో  ఇంటిబయట ఉన్న రామారావుకు చెందిన మోటారు సైకిల్‌ కూడా తీసుకెళ్లారు. మోటారు సైకిల్‌ శబ్దం కావడంతో ఆ బజారులో నివసిస్తున్న మహిళ అనుమానంతో బయటకు వచ్చి కేకలు వేసింది కానీ, అప్పటికే వారు ఉడాయించారు. అదే బజారులో నివసిస్తున్న కూరగాయల వ్యాపారికి చెందిన మోటారు సైకిల్‌ కూడా రెండురోజుల క్రితం చోరీకి గురైంది. దొంగతనం విషయం తెలుసుకున్న ఎస్సై హజరత్తయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించింది. ఒంగోలు సీసీఎస్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హజరత్తయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు