పేదల జీవితాలు మార్చేందుకే వారి పోరాటం

28 Jan, 2016 20:16 IST|Sakshi

- మావోయిస్టు నేత కుమార స్వామి అంతిమ యాత్రలో వరవరరావు
నర్సంపేట(వరంగల్ జిల్లా)

 నిరుపేదల జీవితాలను మార్చడానికే వూవోయిస్టులు పోరాటం చేస్తున్నారని విరసం నేత వరవర రావు అన్నారు. నాలుగు రోజుల క్రితం ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట వుండలం భాంజిపేట గ్రామానికి చెందిన పుట్టపాక కుమార స్వామి... అతని భార్య సోనీ అంతిమ యాత్రలో వరవర రావు మాట్లాడారు.


కుమారస్వామి, సోనీలు ప్రజల కోసం పోరాడుతూ మృతి చెందారని పేదల పక్షాన పోరాటం చేస్తూ.. శాఖ మూరి అప్పారావు, పుట్టపాక కుమారస్వామి, సోనీ లాంటి ఎందో మంది అమరులయ్యారని అన్నారు. కుమార స్వామి తన చిన్నతనంలో కలలు కన్న రాజ్యాన్ని ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేశాడన్నారు. విద్యార్థి దశలోనే కుమాక స్వామి రాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడని, 1993లో అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిపారు.కుమార స్వామి దంపతుల మృత దేహాలు చూస్తే.. బుల్లెట్ గాయాలు, చిత్ర హింసలకు గురిచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అన్నారు.

రాజకీయాల్లో పెత్తనం చేసే వారు.. కుమార స్వామి తల్లికి బదులు చెప్పాలన్నారు. ఎందరో అమరుల త్యాగాలతో రాజకీయ నాయకులు తెలంగాణలో అధికార పదవులు అనుభవిస్తున్నారని అన్నారు.

కాగా.. మావోయిస్టు దంపతులు పుట్టపాక కుమార స్వామి, అతని భార్య చింద్రీ లింగో అలియాస్ సోనీ అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరిగాయి.  వీరి మృతదేహాలను గురువారం ఉదయం నుంచి భారీ ఎత్తున ప్రజలు సందర్శించుకున్నారు. కుమారస్వామి అన్న కుమారుడు దహన సంస్కారాలను నిర్వహించారు. అంతిమ యాత్రలో ప్రజాసంఘాల నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు బాసిత్, వెంకన్న, రమేష్ చందర్, భారతక్క, సురేష్, పద్మకుమారి, భారతి, రంజిత్, అంజమ్మ, జ్యోతక్క, శాంత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు