విద్యార్థులు లేకున్నా కౌన్సెలింగ్!

22 Aug, 2015 01:29 IST|Sakshi


• 26 నుంచి పీజీఈసెట్ వెబ్ ఆప్షన్లు
• ఫీజులు ఇవ్వని ప్రభుత్వం...
•సర్టిఫికెట్లను నిరాకరించిన కాలేజీలు
•గందరగోళంగా విద్యార్థుల పరిస్థితి

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయని కారణంగా వేల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన విద్యార్థుల్లో అనేకమంది ఇప్పటికీ... బీటెక్ సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈనెల 26 నుంచి ఎంటెక్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ సిద్ధమైంది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోలేని వారంతా విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పు చేసో, మరెలాగో కాలేజీలకు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకున్నవారు మాత్రం ఈనెల 14వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారు మాత్రమే ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు.

కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి చదువుకొని, డబ్బు చెల్లించలేక సర్టిఫికెట్లను తెచ్చుకోలేని వారి గురించి మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన 43,776 మందిలో 38,882 మంది  అర్హత సాధించారు. వారిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 16 వేల మంది మాత్రమే. మిగతా వారిలో చాలా మంది కాలేజీలకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక.. వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. దీనికితోడు ఈనెల 14వ తేదీ తరువాత సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి వెరిఫికేషన్ అవకాశం లేకపోవడంతో.. వారంతా ఆందోళన చెందుతున్నారు. సర్కారు ‘ఫీజు’ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు విలువైన ఒక ఏడాది సమయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
 

మరిన్ని వార్తలు