అక్టోబర్‌ నుంచి చెల్లింపులు లేవు..

3 Jan, 2017 01:17 IST|Sakshi
అక్టోబర్‌ నుంచి చెల్లింపులు లేవు..

నాన్‌ప్లానింగ్‌  పనులకైతే ఎనిమిది నెలలుగా..
గుత్తేదార్ల   అసోసియేషన్‌ సమాలోచనలు?
పనులు ఆపిన కాంట్రాక్టర్లకు  శ్రీముఖాలు
ఆర్‌అండ్‌బీ శాఖలో అయోమయం


నిజామాబాద్‌ : రహదారులు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ)లో అయోమయం నెలకొంది. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎనిమిది నెలలుగా జాప్యం జరుగుతుండగా, మరోవైపు పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదార్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో పనుల కొనసాగింపుపై గుత్తేదార్లు సమాలోచనలో పడినట్లు సమాచారం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1,971 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ శాఖ రహదారులున్నాయి. ఇందులో 236 కి.మీ. రాష్ట్ర రహదారులు  కాగా, 854 కి.మీ. జిల్లా రహదారులు ఉన్నాయి. మరో 881 కి.మీ. గ్రామీణ, ఇతర రహదారులున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఉన్న రహదారులను డబుల్‌లైన్‌ రోడ్లుగా, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఉన్న రహదారులను నాలుగులైన్‌ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఇలా జీఓ నంబర్‌ 129 కింద సుమారు రూ.238 కోట్లు, జీఒ నంబర్‌ 130 కింద సుమారు రూ.533 కోట్లు మంజూరయ్యాయి. కానీ.. ఈ నిధులతో చేపట్టిన పలు పనులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. అక్టోబర్‌ నుంచి ఈ బిల్లులు రాకపోవడంతో పనులు కొనసాగించేందుకు గుత్తేదార్లు సమాలోచనలో పడినట్లు సమాచారం.

ఎనిమిది నెలలుగా..
ఇక నాన్‌ప్లాన్‌ (ప్రణాళికేతర) పద్దు కింద చేపట్టిన పనులకైతే ఎనిమిది నెలలుగా బిల్లులు నిలిచిపోయినట్లు ఆర్‌అండ్‌బీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్‌ప్లాన్‌ కింద రహదారుల నిర్వహణ పనులు చేపడతారు. బీటీ రెన్యూవల్స్, ప్యాచ్‌వర్క్‌లు చేస్తుంటారు. ఈ పనులకైతే ఎనిమిది నెలలుగా బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. ఇలా పిరియాడికల్‌ రెన్యూవల్స్‌ కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 76 పనులు కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.

గుత్తేదార్లకు శ్రీముఖాలు..
మరోవైపు పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదార్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు పెద్ద ఎత్తున రహదారుల పనులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు పోటీ పడి పనులు దక్కించుకున్నారు. కానీ.. పనులు చేయడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. కొన్ని రోడ్లయితే నెల రోజులకు పైగా పనులు కుంటుపడటంతో అధికారులు సదరు గుత్తేదార్లకు నోటీసులు జారీ చేశారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం చేసిన ఐదుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామని రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు