దురద, నొప్పికి తేడా ఉందా?

20 Sep, 2016 23:13 IST|Sakshi
దురద, నొప్పికి తేడా ఉందా?

దురద అనేది చర్మానికి సంబంధించిన ఒక రకమైన సమస్య. కొన్ని రకాల వ్యాధులు, పొడి చర్మం, ఎలర్జీ వంటి వాటి వల్ల దురద పుడుతుంది. హిస్టామినన్ అనే రసాయనానికి ఎలర్జీని కలిగించే శక్తి ఉంటుంది. ఆ రసాయనాన్ని విడుదల చేసే విధంగా, కొన్ని పదార్థాలు మన శరీరంపై తమ ప్రభావాన్ని చూపినప్పుడు ఎలర్జీ రావడంతో దురద పుడుతుంది. ఉదాహరణకు దోమలు, కొన్ని రకాల పురుగులు కుట్టినప్పుడు కలిగే దురద ఈ రకానికి చెందినదే. కొన్ని రకాల దురదలు తాత్కాలికంగా మాత్రమే ఉంటే మరికొన్ని రకాల దురదలు ఏళ్ళ తరబడి ఉంటాయి.

19వ శతాబ్దంలో, ఫ్రాన్స్ కు వెళ్లి వచ్చిన అమెరికా సైనికులకు ఒక వ్యాధి కారణంగా మొదలయ్యే దురద కనీసం ఏడేళ్ల పాటు వారిని వేధించేది. దాంతో ఆ దురదకి ఏడేళ్ల దురద, ఫ్రెంచి దురద అని పేరు పెట్టారు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల వల్ల వచ్చే దురదలు కూడా అంత సులభంగా తగ్గవు. అయితే అలాంటి వ్యాధులకు వైద్యుల పర్యవేక్షణలో తప్పనిసరిగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా దురద అనేది శరీరంలో ఏదో ఒక ప్రదేశానికో, లేదా కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. దీనికి భిన్నంగా నొప్పి శరీరం అంతటా లేదా శరీరంలోని ఏదో ఒక భాగానికే పరిమితమై ఉండవచ్చు. అయితే దురదలాగా అది కేవలం చర్మానికి మాత్రమే పరిమితమై ఉండదు. దురద అనేది శరీరంపై జరిగే ఒక దాడికి లేదా చర్మవ్యాధికి సంకేతంగా నిలిస్తే, నొప్పి అనేది శరీరానికి వచ్చిన ఒక కష్టానికి సంకేతంగా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు