రోడ్ల నిర్మాణాలు లేవు..చెక్‌డ్యాంల నాణ్యత లేదు

6 Feb, 2017 00:09 IST|Sakshi
రోడ్ల నిర్మాణాలు లేవు..చెక్‌డ్యాంల నాణ్యత లేదు
  • విజిలెన్స్‌ అధికారి తనిఖీల్లో తేలిన నిజాలు
  • త్వరలో పూర్తి స్థాయి తనిఖీలు చేపడతామన్న అధికారి
  • దుత్తలూరు(ఉదయగిరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపి నిధులు కాజేశారు. కొన్ని రోడ్లు సగం మాత్రమే వేసి పూర్తి నిధులు దోచేశారు. నూతన చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతులు నాసిరకంగా ఉన్నాయి. ఇదీ శనివారం జిల్లా విజిలెన్స్‌ అధికారి శ్రీనివాసులురెడ్డి తనిఖీల్లో వెల్లడైన నిజాలు. దుత్తలూరు మండలంలో జరిగిన అవినీతిపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు రాగా స్పందించిన ఉన్నతాధికారులు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం తనిఖీలు చేపట్టారు. బోడవారిపల్లిలో కొన్ని పనులను తనిఖీ చేయగా మూడు రోడ్లు నిర్మించుకుండానే లక్షల రూపాయలు కాజేసినట్లు వెల్లడైంది.

    ఎస్సీ కాలనీ నుండి ఎర్రయ్యబావి వరకు రోడ్డు నిర్మించినట్లు కాగితాలలో చూపించి ఐడీ నెం.0126 మీద రూ.87481 నిధులు కాజేశారు. అలాగే అప్పసముద్రం మెయిన్‌ రోడ్డు నుంచి ఎర్రవాగు చేల వరకు రోడ్డు నిర్మించకుండానే రూ.86278 మెటీరియల్‌ బిల్లు డ్రా చేశారు. ఇలాగే మరికొన్ని పనులను పరిశీలించగా ఇదేస్థాయిలో అక్రమాలు జరగడంతో ఎందుకు ఈ విధంగా చేశారని సస్పెండైన ఈసీ వెంకటేశ్వరరెడ్డి, టీఏ సుబ్రహ్మణ్యంలను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సమాధానం కరువైంది. చెక్‌డ్యాంల మరమ్మతులు నాసిరకంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    పనులకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు అందుబాటులో ఉంచకపోవడంతో ఆయన విచారణకు సహకరిస్తారా లేదా కేసులు నమోదు చేయమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు, అయితే తనిఖీ కోసం ఒక్క అధికారి మాత్రమే రావడంతో తనిఖీలు నామమాత్రంగా జరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను సంప్రదించకుండానే తనిఖీలు చేయడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం, బోడవారిపల్లిలో కొన్ని చెక్‌డ్యాంలు లొకేషన్‌ చేంజ్‌ పేరుతో వేరే చోట నిర్మించామని ఈసీ తెలపడంతో ఆ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పరిశీలించిన పనుల వివరాలను డ్వామా పీడీకి అందజేస్తామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఉపాధిహామీలో జరిగిన ప్రతి పనిని వచ్చే మంగళ, బుధ వారాల్లో రెండు తనిఖీ బృందాలు తనిఖీ జరుపుతాయన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కాగా మంగళవారం నాటికి తాము పరిశీలించడానికి అనుకూలంగా రికార్డులన్నీ పూర్తిస్థాయిలో ఉంచాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో పిచ్చిబాబు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు