సరుకులిచ్చినా సంతోషం ఏదీ?

31 Jan, 2016 03:51 IST|Sakshi
సరుకులిచ్చినా సంతోషం ఏదీ?

సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట రూ. 370.41 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేసినా ఇటు పేదల్లోనూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంతోషం లేకుండా పోయింది. పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి నెయ్యితో కూడిన పిండి వంటలు తిని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరు రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి నాసిరకం సరుకులు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది పేదలు వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

తెల్లరేషన్ కార్డున్న ప్రతి లబ్దిదారుడికి రూ. 270లు విలువ చేసే అరకిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, అర కిలో శనగపప్పు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇచ్చినా వాటిలో బెల్లం కరిగిపోయి వినియోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీనికి తోడు పొట్టుతో కూడిన గోధుమపిండి సరఫరా చేశారు. చంద్రన్న కానుక పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉన్న బ్యాగులో నాసిరకం సరుకులను పేదలకు కట్టబెట్టారు. నాసిరకం సరుకులు ఇవ్వడం వల్ల వాటిని పేదలకు ఉపయోగపడలేదని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్న సీఎం నా ఫోటో ఉన్న బ్యాగులో ఇలాంటి సరుకులు పంపిణీ చేసి తన పరువు తీశారంటూ ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల సమయం ఇచ్చినా నాణ్యమైన సరుకులు ఇవ్వకుండా ముఖ్యమంత్రికి సంతోషం లేకుండా చేశారు.

మరిన్ని వార్తలు