సవాంగ్‌ను సాగనంపారు

16 Dec, 2015 02:42 IST|Sakshi
సవాంగ్‌ను సాగనంపారు

♦ ‘మనీ-సెక్స్’ కేసు కీలక దశలో సర్కారు నిర్ణయం.. బాధితుల్లో ఆందోళన
♦ విజయవాడ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా సురేంద్రబాబు నియామకం
♦ కాల్‌మనీ ముఠా ఆగడాలపై  వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
♦ టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలపై ఆరోపణలు.. పెద్దల్లో గుబులు
 
 సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా గౌతమ్ సవాం గ్ కంటే సమర్థుడైన ఎన్వీ సురేంద్రబాబును నియమించామని డీజీపీ జె.వి.రాముడు చెప్పా రు. ఈ నెల 27 వరకు ఆయనకు సెలవు మంజూరు చేసినట్లు మంగళవారం  విలేకరులకు తెలిపారు. సవాంగ్ బదిలీపై వెళ్లడంతో కాల్‌మనీ బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాల్‌మనీ వ్యవహారంలో తప్పు చేసిన ఎంత గొప్పవారైనా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సదస్సు సందర్భంగా చెప్పారు. కానీ మరుసటి రోజే సీపీ సెలవుపై వెళ్లడం.. బాబుగారి మా టలకు అర్థాలే వేరా? అనే సందేహం కలిగిస్తోంది.

కాల్‌మనీ, ముఖ్యంగా మహిళలపై లై ంగిక వేధింపులకు సంబంధించిన కీలక దర్యాప్తు కొనసాగుతుండగా, కాల్‌మనీ ముఠా ఆగడాలపై ఫిర్యాదులు, మనీ-సెక్స్ దందాలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న దశలో.. కమిషనర్ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. తమపై ఎక్కడ కేసులు నమోదు అవుతాయోనన్న భయంతో వణికిపోతున్న అధికార పార్టీ నేతలు సీఎంపైనా, టీడీపీకి చెం దిన కేంద్రమంత్రిపైనా సవాంగ్‌ను బదిలీ చే యాలనే ఒత్తిడి తెచ్చినట్లు పోలీసువర్గాల సమాచారం. అయితే ఈ దశలో, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో సవాంగ్‌ను బదిలీ చేసినా, దీర్ఘకాలం సెలవుపై పంపినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిం చినట్లు తెలిసింది. దీంతో కొద్దికాలం సెలవుపై పంపితే ఈలోగా అంతా సద్దుమణుగుతుందనే ఉద్దేశంతో.. సవాంగ్‌ను పది రోజుల పాటు సె లవుపై పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 కమిషనర్ వైఖరి నేపథ్యంలోనే..?
 మహిళల విషయంలో పశువుల్లా వ్యవహరించి న వారిని వదిలేది లేదని సీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేయిం చారు. పటమటలో కాల్‌మనీ సెంటర్ నిర్వహిస్తున్న కార్యాలయంపై దాడిచేసి అందులో ఉ న్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ అడ్డగోలు దందాలో అధికార పార్టీ నేతల పెట్టుబడులు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక కీలక మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, విజయవాడలోని డివిజన్ స్థాయి నేత ల పేర్లు బహిర్గతమయ్యాయి.

ఈ రాకెట్‌లో అధికార పక్ష ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వెంకన్న తదితర నేతల పాత్ర ఉందని తేలిపోయింది. మరోవైపు బాధితులందరూ ఫిర్యాదు చేస్తే కేసు మరింత బలపడుతుందని సవాంగ్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తితో పెద్ద సం ఖ్యలో మహిళా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కమిషనర్ సూచనతో ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు ము మ్మరం చేశారు.

తాజాగా మంగళవారం నగరంలోని 92 ప్రాంతాల్లో దాడులు చేశారు. అధికార పార్టీకి చెందిన మరింతమంది పట్టుబడ్డారు. వీరిలో ఎమ్మెల్సీ వెంకన్న బంధువు లు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు ఉన్నారు. దీంతో తమ డొంక కదులుతోందని భావించిన ప్రభుత్వం.. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదంటూ ఒత్తి డి పెంచినట్లు సమాచారం. తాము చెప్పినట్టు విననిపక్షంలో సెలవుపై వెళ్లాలని కూడా మౌఖి కంగా ఆదేశాలు జారీ చేసినట్టు అధికారవర్గా లు తెలిపాయి.

అయితే ఇందులో ప్రభుత్వ ఒత్తిడి ఏమీ లేదని, సవాంగ్ రెండు నెలల కిందటే సెలవు కోరారని డీజీపీ వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశామని చెప్పారు. పలు కేసులు దర్యాప్తులో ఉండగా సీపీని సెలవుపై పంపడం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా వచ్చే సీపీ.. సవాంగ్ కన్నా సమర్థుడని డీజీపీ అన్నారు. తాను ముందుగానే సెలవు కోసం దరఖాస్తు చేశానని ఇప్పుడు శాంక్షన్ అయిందని సీపీ సవాంగ్ చెప్పారు. ఇదే నిజమైతే.. నిన్నగాక మొన్న కాల్‌మనీ కేసు దర్యాప్తు వేగంగా జరిపిస్తామని, మహిళల విషయంలో పశువుల్లా వ్యవహరించిన వారిని వదిలేది లేదని ఎందుకంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, డీజీపీ ఒత్తిడి మేరకే ఆయనలా చెప్పి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 కాల్‌మనీ కేసులో ఒత్తిళ్లు లేవు: సవాంగ్
 కాల్‌మనీ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, తన వ్యక్తిగత పనిమీదే సెలవుపై వెళ్తున్నానని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. గేట్‌వే హోటల్‌లో మంగళవారం సీఎం నిర్వహిం చిన శాంతిభద్రతల సమీక్ష మధ్యలో బయటకు వచ్చిన సవాంగ్‌ను మీడియా పలుకరించడంతో కాల్‌మనీ రాకెట్‌పై అనుమానాలకు తావులేకుండా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటివరకు కాల్‌మనీ రాకెట్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు సాగుతోందని, బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2 నెలల క్రితమే సెలవుకు దరఖాస్తు చేశానని, నెలరోజుల క్రితం సెలవు మంజూరైందని, పది రోజుల తరువాత విధుల్లో చేరతానని చెప్పారు.

మరిన్ని వార్తలు