నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు

17 Mar, 2017 23:38 IST|Sakshi
నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు

నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఉన్న అప్పులు చాలవన్నట్లు కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం రూ.137 కోట్లు, జేఎన్‌ఎన్యూఆర్‌ఎం గృహ నిర్మాణాలు, ఇతర ప్రాజెక్టుల పూర్తికి రూ.100 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. రూ.73 కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోయాయి. టాప్‌ డిఫాల్టర్స్‌ లిస్ట్‌లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండటం పాలకుల పనితీరును తేటతెల్లం చేస్తోంది...

విజయవాడ సెంట్రల్‌ : నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అనే చందంగా టీడీపీ పాలకుల పనితీరు తయారైంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నగరపాలక సంస్థ ఆదాయానికి పాలకులు మరింత గండికొడుతున్నారు. ఏళ్ల తరబ డి పన్ను బకాయిలు చెల్లించకుండా ఆట లాడుతున్నారు. సుమారు రూ.73.39 కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులే లెక్కతేల్చారు. టాప్‌ 100 డిఫాల్టర్స్‌లో చోటుదక్కించుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) రూ.9,44,505, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ రూ.14,86,358 మేర పన్నుబకాయిలు చెల్లించాల్సి ఉం ది. గడిచిన రెండేళ్లుగా బకాయిలు చెల్లిం చలేదని సమాచారం. 

సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి నగరపాలక సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పడండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించే అధికారులు పాలకుల నుంచి పన్నులు వసూలు చేయలేక అగచాట్లు పడుతున్నారు. జలీల్‌ఖాన్‌ ఇటీవలే రూ.2లక్షలు చెల్లించి మిగతా మొత్తాన్ని బకాయి పెట్టినట్లు తెలుస్తోంది. అదేమంటే మాది ఉమ్మడి ఆస్తి, నా తమ్ముడు వాటా తాలూకు బకాయి ఉందంటూ రెవెన్యూ అధికారులకు కథ చెప్పినట్లు తెలుస్తోంది.  ఎంపీ కేశినేని వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రూ.2 లక్షలపైనే బకాయి ఉన్నారు. 2016–17 సంవత్సరానిదే కాబట్టి కట్టేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

అప్పుమీద అప్పు
కాంగ్రెసోళ్ళు అప్పులు చేసి కార్పొరేషన్‌ను నాశనం చేశారని పదేపదే తిట్టిపోసే టీడీపీ పాలకుల నోట అప్పుల పాట వినిపిస్తోంది. జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ప్రాజెక్ట్‌లోని గృహనిర్మాణాలు, ఇతర పథకాల పూర్తి కోసం రూ.100 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకొనేందుకు ఇటీవలే కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా బందరు, ఏలూరు రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు ప్రత్నామ్నాయ రహదారులు, వంతెనల నిర్మాణం కోసం రూ.137 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ఇందుకోసం అప్పు చేయాలని ప్రభుత్వం నగర పాలక సంస్థకు సూచించింది. మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు నగరపాలక సంస్థకు సంబంధం ఏమిటన్నది అంతుబట్టని విషయం. రూ.137 కోట్లు అప్పు తీసుకున్నట్‌లైతే కార్పొరేషన్‌ ఆర్థిక పరిస్థితి చిధ్రం అవుతోంది. ఇప్పటికే రూ.284 కోట్ల అప్పులో ఉంది. జెఎన్‌ఎన్యూఆర్‌ఎం, మెట్రోరైలు అప్పులు కలిపి రూ. 237 కోట్లు వెరసి రూ.521 కోట్లకు అప్పు ల చేరుతోంది. కార్పొరేషన్‌ ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే సరిపోతుంది.

పుష్కర నిధుల్లో కోతే
కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.186 కోట్లలో ఇప్పటి వరకు రూ.91 కోట్లే విడుదలయ్యాయి. మిగితా రూ.95 కోట్లలో కోతపెట్టాలనే యోచన లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్లు, డ్రెయినేజ్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండగా వాటిని పక్కన బెట్టేయమని ఆదేశాలు ఇచ్చినట్లు  తెలుస్తోంది. పుష్కరాలను పురస్కరించుకొని చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ.17.16 కోట్లు ఇప్పటికీ మంజూరు చేయలేదు. వీటి విడుదల కోరుతూ మేయర్‌  శ్రీధర్‌ ఆర్థికమంత్రి, ఎంఏయూడీ ప్రిన్సిపుల్‌ సెక్రటరీ, డీఎంఏల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

అప్పు కాదు గ్రాంటు
 మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు రూ.137 కోట్లను ప్రభుత్వం గ్రాంట్‌గా మంజూరు చేస్తోంది. ఇందుకోసం ఎలాంటి అప్పు చేయడం లేదు. జెఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం పూర్తి కావాలంటే అప్పు చేయక తప్పదు. త్వరలోనే కృష్ణాపుష్కరాల నిధులు విడుదల అవుతాయి.       కోనేరు శ్రీధర్‌ మేయర్, నగరపాలక సంస్థ

>
మరిన్ని వార్తలు