షటిల్‌ బ్యాడ్మింటన్‌ విజేతలు వీరే..

28 Oct, 2016 21:31 IST|Sakshi
షటిల్‌ బ్యాడ్మింటన్‌ విజేతలు వీరే..
ముగిసిన ఆంధ్రప్రదేశ్‌ బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు
రసవత్తరంగా సాగిన ఫైనల్స్‌
 
తెనాలి: బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2016 పోటీలు ముగిశాయి. అండర్‌–13, అండర్‌–15 కేటగిరీల్లో బాలబాలికలకు ఇక్కడి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన పోటీలు శుక్రవారం సాయంత్రం జరిగిన రసవత్తరంగా సాగాయి. అండర్‌–15 ఫైనల్స్‌ పోటీల్లో బాలుర డబుల్స్‌  విభాగంలో గుంటూరుకు చెందిన సాయిచరణ్‌ కోయ–చరణ్‌నాయక్‌ జట్టు విన్నర్స్‌గా నిలిచింది. వీరు కర్నూలు క్రీడాకారులు సాయినాథ్‌రెడ్డి–అర్షద్‌పై 21–11, 21–15 స్కోరుతో విజయం సాధించారు. ఇదే కేటగిరీ బాలికల విభాగంలో మేఘ (కర్నూలు)–వెన్నెల (కడప) 21–14, 21–18 స్కోరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్‌.జాహ్నవి–కె.మేఘనపై జట్టుపై గెలుపొందారు. సింగిల్స్‌ మ్యాచ్‌ బాలుర విభాగంలో షేక్‌ అర్షద్‌ (కర్నూలు) విన్నర్‌ కాగా, షేక్‌ ఇమ్రాన్‌ (అనంతపురం) రన్నర్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో కర్నూలు క్రీడాకారిణి పి.మేఘ, చిత్తూరు క్రీడాకారిణి గీతాకృష్ణ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
 
అండర్‌–13 కేటగిరీలో...
అండర్‌–13 కేటగిరీ బాలుర డబుల్స్‌లో అనంతపురం ద్వయం బీ విజయ్‌–పి.రాహుల్‌ విన్నర్స్, ఎ.నిధిభట్‌ (కర్నూలు)–షేక్‌ నుమెయిర్‌ (ప్రకాశం) జంట రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ జట్టులోని ఆయేషాసింగ్‌–కేపీఎస్‌ ప్రజ్ఞ విన్నర్స్, ఎ.నయనవి రెడ్డి (పశ్చిమగోదావరి)– కె.రిషిక (కృష్ణా) జంట రన్నర్స్‌ స్థానాలు సాధించారు. ఇదే కేటగిరీ బాలుర సింగిల్స్‌లో బి.విజయ్‌ (అనంతపురం), ఎ.వంశీకృష్ణ (పశ్చిమగోదావరి), విన్నర్, రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ క్రీడాకారిణి ఆయేషాసింగ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దోబచర్ల చిరుహాసిని మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో 19–21, 21–16, 21–17 ఆయేషాసింగ్‌ గెలుపొందారు.
 
సీడింగ్‌ అర్హత కలిగిన క్రీడాకారులే కాకుండా కొత్తగా పాల్గొన్నవారు వందకుపైగా ఉన్నారు. వీరికి సీడింగ్‌ అర్హత కోసం రోజున్నర పోటీలు నిర్వహించారు. స్థానిక ఇండోర్‌ స్టేడియం, వీఎస్సార్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కాలేజీలో పోటీలు సాగాయి.. మొత్తం 8 ఈవెంట్లలో తణుకులోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ క్రీడాకారులు ఐదు ఈవెంట్లలో ఫైనల్స్‌కు చేరుకున్నట్టు అకాడమీ కోచ్‌ సమ్మెట సతీష్‌బాబు చెప్పారు. టోర్నమెంటు రిఫరీగా షేక్‌ జిలానీబాషా (కడప), డిప్యూటీ రిఫరీగా షేక్‌ హుమయూన్‌ కబీర్‌ (ప్రకాశం) వ్యవహరించారు.
మరిన్ని వార్తలు