మా బిడ్డను చంపేశారు...

8 Mar, 2017 22:46 IST|Sakshi
  • విద్యార్థి తల్లిదండ్రుల  ఆందోళన
  • శ్రీ చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత
  • బాధితులకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి
  • రామవరప్పాడు (గన్నవరం): శ్రీ చైతన్య కళాశాలలో మృతి చెందిన విద్యార్థి సుబ్బారెడ్డి బంధువులు మంగళవారం ఆందోళన చేశారు. మా బిడ్డ మృతికి కళాశాల యాజమాన్యం కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరులోని కళాశాలకు చెందిన రామన్‌ భవన్‌–4లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆనం సుబ్బారెడ్డి మృతి సోమవారం మృతి చెందిన విషయం విదితమే. వైఎస్సార్‌ జిల్లా నుంచి సుమారు 30 మంది మృతుడి బంధువులు కళాశాల వద్దకు చేరుకుని తొలుత ప్రధాన గేటు వద్ద బైఠాయించారు.

    కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే సుబ్బారెడ్డిని కళాశాల నిర్వాహకులు వెనుకంజలో ఉన్నాడనటం అవాస్తమంటూ సాధించిన మార్కుల లిస్టులను మృతుడి తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, రాధమ్మలు విలేకరులకు చూపించారు. తోటి విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్‌ మా బిడ్డ చనిపోవడానికి కారణమంటూ ఆరోపించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే తలను గోడకేసి కొట్టి, భవనంపై నుంచి తోసేసినట్లుగా ఉందని తమ అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పటమట సీఐ కెనడి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.

    విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి
    కొలుసు పార్థసారథి
    విద్యార్థి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి డిమాండ్‌ చేశారు. బాధితులను పరామర్శించి, కళాశాల ప్రిన్సిపాల్‌తో చర్చించారు.  మార్కులు తక్కువ వస్తాయంటూ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని యాజమాన్యం చెబుతుందని, మృతుడి బంధువులు మాత్రం సుబ్బారెడ్డి  మృతిపై అనుమానాలు వ్యక్తబరుస్తున్నారన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అనుమానాలకు తావిస్తుందని పోలీసు ఉన్నాతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఈ ఘటనను పోలీసు కమిషనర్‌ దృష్టికి కూడా  తీసుకెళ్లతానని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి కైలే అనీల్‌ కుమార్, నిడమానూరు గ్రామ యువజన నాయకుడు చేకూరి చక్రి ఉన్నారు.      

మరిన్ని వార్తలు