అగ్గిపుల్ల వెలిగించి ... దొరికిపోయాడు

1 Jan, 2016 13:01 IST|Sakshi
అగ్గిపుల్ల వెలిగించి ... దొరికిపోయాడు

కాకినాడ : ఓ చిన్న క్లూ భారీ చోరీ కేసును ఛేదించింది. దొంగతనాల్లో ఆరితేరిన వాడిని అగ్గిపెట్టి పట్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం కాకినాడలో ఎస్పీ రవీ ప్రకాష్ విలేకర్లకు వెల్లడించారు. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెంఇన తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను (33) ఇంటర్ చదివాడు. చెడు అలవాట్లకు బానిసై చోరీల బాట పట్టాడు. 2004లో మోటర్ సైకిల్ చోరీ కేసు... 2011 ట్రాక్టర్ చోరీ కేసులో జైలుకెళ్లాడు.

మధ్యలో 2010లో కాకినాడలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగానికి చేరి రూ. 50 వేలు సంస్థ సొమ్ము స్వాహా చేయడంతో అతన్ని తొలగించారు. భారీ చోరీ చేసి ట్రావెల్స్ సంస్థ పెట్టుకుని సెటిలవ్వాలని భావించాడు. ఆ క్రమంలో తాను పని చేసిన కంపెనీనే ఎంచుకున్నాడు. గత ఏడాది నవంబర్ 29వ తేదీన సదరు ఆపీసును గమనించాడు.

30 రాత్రి కారులో వచ్చి, మంకీ క్యాప్ ధరించి కిటికీ గ్రీల్స్ తొలగించి... బ్రాంచ్ మేనేజర్ రూంలో ప్రవేశించాడు. మేనేజర్ రూమ్లోని క్యాష్ చెస్ట్లో నుంచి 230.81 గ్రాముల బంగారంతోపాటు, రూ. 17.75 లక్షల నగదు చోరీ చేశారు. అలాగే నాలుగు కంప్యూటర్లు, ఓ ప్రింటర్, రెండు కుర్చిలు కూడా కారులో వేసుకెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొంతమందిని అనుమానించారు.

అయితే శ్రీనివాస్ పథకం ప్రకారం చోరీ చేసిన నేపథ్యంలో గది అంతా చీకటిగా ఉంది.  దీంతో ఓ మూల ఉన్న అగ్గిపెట్టి తీసి వెలిగించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ గదిలో అగ్గిపెట్టి ఎక్కడ ఉంటుందో సిబ్బందికి మాత్రమే తెలుస్తుందని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఆఫీసులో పనిచేసి మానేసిన వారిపై నిఘా పెట్టారు. ఆ క్రమంలో శ్రీనివాస్పై అనుమానంతో అదుపులోకి తీసుకుని.. తనదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి నగలు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు