ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగల అరెస్టు

1 Jun, 2016 07:42 IST|Sakshi
ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగల అరెస్టు

తిరుపతి క్రైం: బద్వేల్ ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగలను మంగళవారం క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు క్రైం ఏఏస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మే 27 నుంచి 29వతేదీ వరకు నిర్వహించిన మహానాడులో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, గుంటూరుకు చెందిన పూనం శ్రీనివాసరెడ్డి పర్సులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అందులో రూ.95 వేలు ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కొండారెడ్డి, సీసీఎస్ స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రకాశం జిల్లా విజిలిపేట చీరాలకు చెందిన గరికప్రసాద్ (38), గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరుకు చెందిన సముద్రాల కృష్ణారావును కరకంబాడి రోడ్డులోని లెప్రసీ ఆస్పత్రి వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. విచారణలో వారు మహానాడులో కార్యకర్తల్లా తిరుగుతూ పిట్‌పాకెట్ చేసినట్టు అంగీకరించినట్టు ఏఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.

వారి నుంచి రూ.95 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పాతనేరస్తులని పేర్కొన్నారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, ఆశీర్వాదం, రామ్మూర్తి, సిబ్బంది సుధాకర్, మునిరాజ, కత్తుల గోపికృష్ణ, బారుషా, మురళికి ఏఎస్పీ రివార్డులు అందజేశారు.

మరిన్ని వార్తలు