పాలచ్చూరులో భారీ చోరీ

26 May, 2017 12:20 IST|Sakshi
పాలచ్చూరులో భారీ చోరీ

► 70 సవర్ల బంగారు నగలు, రూ.4 లక్షల నగదు అపహరణ
► క్లూస్‌ టీం పరిశీలన
 

పాలచ్చూరు (పెళ్లకూరు) : కుటుంబ సభ్యులందరూ ఆరుబయట నిద్రపోతుండగా గుర్తుతెలియని దుండగులు గురువారం తెల్లవారుజామున ఇల్లు లూటీ చేశారు.  కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసుకున్న 70 సవర్ల బంగారు నగలు, రూ.4 లక్షలు నగదును దుండగులు అపహరించుకుని వెళ్లడంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలు బాధుకుంటూ రోదించారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. పాలచ్చూరు గ్రామానికి చెందిన అక్కరపల్లి తేజోపాల్‌రెడ్డి, భార్య అంజమ్మ, కుమారుడు సంజయ్‌ బుధవారం భోజనం అనంతరం ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో ఆరుబయట నిద్రపోయారు.

గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక ఉన్న కిటికిని తొలగించి లోపలకు ప్రవేశించారు. దేవుడు గదిలో ఉన్న బీరువాలో దాచిన 70 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షలు నగదును అపహరించారు. క్లూస్‌టీమ్‌కు ఆనవాలు దొరక్కుండా ఉండేందుకు లోపలికి ప్రవేశించిన మార్గం లో దుండగులు కారంపొడి చల్లి వెళ్లారు. గురువారం తెల్లవారు జామున నిద్రలేచిన అంజమ్మ ఇంటి తలుపులు తీసి లోపలకు వెళ్లగా బీరువా తెరిచి ఉంది. ఆందోళనతో పరిశీలించగా నగదు, బంగారు నగలు లేకపోవడం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి కేకలు వేస్తూ గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయింది.

దీంతో చుట్టుపక్కల వారంతా గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు డీఎస్పీ బీ శ్రీనివాస్, సీఐలు అక్కేశ్వరరావు, రత్తయ్య, ఎస్సై రవినాయక్‌ తమ సిబ్బందితో  చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. చోరీ చేసేందుకు దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన తీరును బట్టి పథకం ప్రకారమే రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట ప్రాంతాలకు చెందిన క్లూస్‌ టీమ్‌ సిబ్బంది సంఘటనా స్థలంలో ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలను సేకరించారు.  


పెళ్లి సంబంధాల వస్తున్నాయని  
తేజోపాల్‌రెడ్డి, అంజమ్మ కుమార్తె పద్మజ బెంగళూరులో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తుంది. కుమార్తెకు వివాహ సంబంధాలు వస్తుండటంతో నాలుగు రోజుల కిందట బ్యాంక్‌లో ఉన్న బంగారు నగలు విడుదల చేసినట్లు బాధితులు తెలిపారు. ఇతరుల దగ్గర అప్పుగా తెచ్చిన రూ.4లక్షలు నగదును ఇంట్లో బీరువాలో దాచుకున్నట్లు బాధితులు తెలిపారు. వేసవి తాపానికి ఉక్కపోత అధికంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తుండగా చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు వివరించారు.

ఈ తరహా దొంగలను పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశాం
వేసవి కాలంలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నప్పటికి వాటిని అదుపు చేసేందుకు ముందుస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు గూడూరు డీఎస్పీ బీ శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పటికే మేనకూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడిన దొంగల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు వివరించారు. గూడూరు రూరల్‌ సీఐ అక్కేశ్వరరావు, నాయుడుపేట సీఐ రత్తయ్యతో పాటు ఐడీ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాలచ్చూరు పరిధిలో కొత్త మొబైల్‌ నంబర్లతో వెళ్లిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా దొంగలను గుర్తిస్తామని తెలిపారు.
                                                                             – బీ శ్రీనివాస్, గూడూరు డీఎస్పీ

మరిన్ని వార్తలు