ఘనంగా తిక్కయ్యస్వామి తిరునాల

1 Apr, 2017 23:41 IST|Sakshi
ఘనంగా తిక్కయ్యస్వామి తిరునాల

నార్పల : మండల కేంద్రంలో తిక్కయ్యస్వామి ఉట్ల పరుష శనివారం అత్యంత వైభవంగా సాగింది. వేకువ జామున వేద పండితులు ఆలయంలో హోమం నిర్వహించి స్వామివారి మూలవిరాట్‌ను గంగాజలంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిలిపిన ఉట్లమాను ఎక్కేందుకు స్థానిక వాల్మీకి యువజన సంఘం సభ్యులు తాంబూలం స్వీకరించారు. అశోక్‌ అనే యువకుడు ఉట్లకాయను పగులగొట్టగా, ఉట్లమాను ఎక్కే పోటీలో రాము విజయం సాధించాడు. విజేతలకు డొక్కాకృష్ణ రూ.5116, రూ.3116లు బహుమతి ప్రదానం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉట్ల తిరునాల తిలకించేందుకు ఆలయ ప్రాంగణంలో కిక్కిరిశారు.

అలాగే ఉత్సవాల సందర్భంగా తప్పెట పోటీలు నిర్వహించారు, విజేతలైన నార్పలకు చెందిన పెద్దగంగయ్య, వైఎస్సార్‌జిల్లా గురుజాలకు చెందిన లక్ష్మినారాయణ, వెలిదండ్లకు చెందిన పుల్లయ్య, గరిసినపల్లికి చెందిన ఈరప్పకు వెండి బహుమతులు సింగరయ్య అందజేశారు. రాత్రికి తిక్కయ్యస్వామి ఉత్సవ విగ్రహాన్ని పుర వీధుల్లో ఊరేగించారు. అలాగే భజన కార్యక్రమం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకం అలరించాయి. ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సేవా కార్యకర్తలు రేకులకుంట లక్ష్మిరెడ్డి, తలారి ఆంజనేయులు చెప్పారు.

మరిన్ని వార్తలు