వామ్మో..అంత ఫీజా!

26 Jun, 2016 03:04 IST|Sakshi

భావి ఇంజనీర్లతో ప్రభుత్వం ‘సీట్లా’ట!
ఫీజుల ఖరారులో జాప్యం..భారీగా పెంచిన వైనం
ఎంసెట్ షెడ్యూలంతా ప్రహసనమే
కౌన్సెలింగ్‌ను నిర్వహించి మిన్నకున్నారు
1నుంచి కళాశాలలను ప్రారంభించాలని ప్రకటన
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

కడప ఎడ్యుకేషన్: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.. టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి అన్నింటా పారదర్శకంగా చేస్తున్నాం .... ఈ ఏడాది ఎంసెట్‌లో మార్పులు చేసి ముందుగానే పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా తీవ్రజాప్యంతో భావి ఇంజనీర్లకు చుక్కలు చూపెడుతోంది. ఫీజును భారీగా పెంచి వారిపై పెనుభారం మోపింది. ఫీజుల పెంపుతో కొంతమంది మధ్యతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పునరాలోచనలో పడ్డారు. కొందరైతే అంత ఫీజు కట్టలేమంటూ డిగ్రీ వైపు వెళ్తున్నట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే.. ఎంసెట్ ప్రవేశపరీక్షను ఏప్రిల్ 29న నిర్వహించారు. ఈ పరీక్షను ప్రొద్దుటూరు, కడపలోని పలు కేంద్రాల్లో 7 వేలమందికి పైగా విద్యార్థులు రాశారు. ఇందులో ర్యాంకులు వచ్చిన వారందరికీ ఈనెల 6 నుంచి 15 వరకూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు ప్రొద్దుటూరు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలోను కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌లో వైవీయూలో 1,400 మంది, ప్రొద్దుటూరు సెంటర్‌లో 1,323 మంది కడపలోని పాలిటెక్నిక్ సెంటర్‌లో 1,430 మంది పాల్గొన్నారు. వారి ర్యాంకు కార్డులతోపాటు సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు.

వారంతా ఇష్టమైన కళాశాలలను, కోర్సులను ఎంపిక చేసుకునేందుకు వెబ్ కౌన్సెలింగ్‌కు వెళ్లారు. మళ్లీ ఏవైనా కోర్సులు కానీ కళాశాలలను మార్చుకోదలచిన వారు ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు మార్చుకోవచ్చని అవకాశం ఇచ్చారు. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం కాలయాపన చేస్తూ మళ్లీ 24వ తేదీ రాత్రి విద్యార్థుల సెల్‌లకు మెసేజ్‌లను పంపుతూ 26 వతేదీ వరకూ కళాశాలలు, ఆప్షెన్‌లను మార్చుకోవచ్చని పేర్కొన్నారు.

ఇప్పటికే పొరుగురాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తయి తరగతులను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా అధ్వానంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కళా శాలల్లో ఫీజుల వివరాలను ప్రభుత్వం కాలయాపన చేసి శుక్రవారం విడుదల చేసింది. గతంలో కన్నా రెట్టిం పుగా ఫీజులను పెంచారు. కమీషన్ల కోసమే ఫీజుల పెంపు తతంగమం తా నడుపున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 షెడ్యూల్ ప్రకారం కష్టమే..
ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన విడుదల ప్రకారం జూలై 1 నుంచి కళాశాలలు ప్రారంభం ఉంటాయని ప్రకటించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సీటు కేటాయింపుపై అతిగతీ లేకుండాపోయింది. దీంతో విద్యార్థులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తూ మళ్లీ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని సెల్‌లకు సంక్షిప్త సమాచారం పంపడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య ఇక కష్టమే
పేదవాడికి సైతం ఇంజనీరింగ్ విద్యనందించాలన్న ఉన్నతాశయంతో దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో వేలమంది పేదలు ఇంజనీరింగ్‌ను పూర్తిచేసి ఉన్నతస్థాయిల్లో స్థిరపడ్డారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ఇంజనీరింగ్ ఫీజులను భారీగా పెంచేసింది. దీంతో పేద విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఉన్న ఫీజుకంటే 30 శాతం అదనంగా ఫీజులను పెంచింది.

తీరా కౌన్సెలింగ్ అయిపోయాక ప్రభుత్వం విద్యార్థులపై ఫీజుల పిడుగును పడేసింది. దీంతో ఇక్కడ భారీగా పెరిగిన ఫీజులు కట్టేదాని కంటే బయట ప్రాంతంలో మంచి కళాశాలలో చేరి ఇంజనీరింగ్ చేస్తే బాగుటుందని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో చిన్న కళాశాలల్లో రూ.35 వేల నుంచి ఇంజనీరింగ్ ఫీజులు ప్రారంభమయ్యేవి. అలాంటింది ఇప్పడు భారీగా పెరిగింది. గరిష్ట ఫీజును రూ.1.08 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పేదలకే కాదు మధ్యతరగతి వారికి కూడా ఇంజనీరింగ్ విద్య ఇక మిథ్యగానే మిగలనుంది

మరిన్ని వార్తలు