ఈ – ఆఫీసు అమలులో...అట్టడుగున ‘అనంత’

29 Mar, 2017 23:21 IST|Sakshi
ఈ – ఆఫీసు అమలులో...అట్టడుగున ‘అనంత’
అనంతపురం అర్బన్‌ : 
ఈ – ఆఫీసు అమలులో అనంతపురం రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారానే పరిష్కరించాలని అధికారులు ఆదేశాలిస్తున్నారు. జిల్లాలో 100కు పైగా ప్రభుత్వ శాఖల్లో ఈ - ఆఫీసు అమలు చేస్తున్నారు. అయితే అమలులో చాలా వెనుకబడి ఉంది. జనవరిలో 1,380 ఫైళ్లు, ఫిబ్రవరిలో 1,004 ఫైళ్లు పరిష్కరించారు. మార్చిలో 741 ఫైళ్లను పరిష్కరించడంతో సరిపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఫ్లైళ్ల పరిష్కారంలో జాప్యం జరిగిందని కొందరు అధికారులు సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనంతపురం జిల్లాలో మాత్రమే జరగలేదు.
 
అనంతపురం ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాలు కూడా వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా యంత్రాంగానికి అదనపు పని ఏదైనా ఉందంటే అది ఓట్ల లెక్కింపు మాత్రమే. మిగతా ఎన్నికల ప్రక్రియ మూడు జిల్లాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. మార్చిలో వైఎస్‌ఆర్‌ జిల్లాలో 6,906 ఫైళ్లు, కర్నూలు జిల్లాలో 1,347 ఫైళ్లను పరిష్కరించారు. జిల్లాలో మాత్రం 741కే పరిమితమైంది. ఒక్క మార్చిలోనే కాదు జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల కంటే అనంతపురం జిల్లా వెనకబడి ఉంది. ఇక రాష్ట్రంలో ఏకంగా 13వ స్థానంలో నిలిచింది. 
 
ఈ–ఆఫీసుపై తగ్గిన శ్రద్ధ
జిల్లా ఉన్నతాధికారులు ఈ–ఆఫీసు అమలు ప్రారంభంలో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ప్రతి ఫైలు ఈ–ఆఫీసు ద్వారానే రావాలనే కచ్చితమైన ఆదేశాలిచ్చారు. రానురాను ఈ–ఆఫీసుపై సమీక్షలు తగ్గిపోయాయి. అదే స్థాయిలో ఫైళ్ల పరిష్కారమూ మొక్కుబడి తంతుగా మారింది. 
 
మరిన్ని వార్తలు