డీబార్ ‘150’

16 Mar, 2016 03:15 IST|Sakshi

ఇంటర్ పరీక్షల్లో ఇదీ పరిస్థితి
జంటజిల్లాల్లో గణనీయంగా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు
విస్మయం వ్యక్తం చేస్తున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్:  ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో డిబార్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే..  రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే కాపీ కొడుతూ దాదాపు 150 మంది పట్టుబడ్డారు. సెకండియర్‌కు సంబంధించి మరో పరీక్ష మిగి లి ఉండగానే ఈ స్థాయిలో డిబార్ కావటం చర్చ నీయాంశంగా మారింది. నిత్యం డిబార్ అవుతున్న విద్యార్థుల సంఖ్యను చూసి అధికారులు సైతం విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో స్క్వాడ్‌లకు దొరకడం తమ అనుభవంలో ఇదే తొలిశారని అంటున్నారు. ఎటువంటి తప్పిదాలకు, కాపీయింగ్ తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

ఈ క్రమంలో పరీక్షల ప్రారంభం నుంచి పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహిం చడంపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సాధ్యమైనన్ని కేంద్రాల్లో 11 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. జంట జిల్లాల్లో ఒక్కో పరీక్షకు 50కి పైగా కేంద్రాల్లో తనిఖీ బృందాలు తిరిగాయి. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఒకేరోజు గరిష్టంగా 24 మంది కాపీ కొడుతూ పట్టుబడటం... కాపీయింగ్ తీవ్రతను తెలియజేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 71,  హైదరాబాద్ జిల్లాలో 75 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఇందులో నలుగురు విద్యార్థులు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికారు. ఇవన్నీ కలుపుకుంటే.. పట్టుబడిన వారి సంఖ్య 146కు చేరింది. వీరందరిపై ఆయా పోలీస్‌స్టేషన్లలో మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నించిన ఫస్టియర్ విద్యార్థి ఎజాజ్ ఈనెల 12న సనత్‌నగర్‌లో ఇన్విజిలెటర్‌కు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు నగరంపై పడింది. ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు.

 ముగిసిన ఫస్టియర్ పరీక్షలు
ఈనెల 2న ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ కట్టిన విద్యార్థులు.. పరీక్షలు ముగియడంతో చిరునవ్వుతో ఇంటిముఖం పట్టారు. చివరి పరీక్షలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఫస్టియర్ ప్రధాన సబ్జెక్టులన్నీ పూర్తికాగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా శనివారంతో ముగియనున్నాయి. బుధవారం జరిగే పరీక్షతో సెకండియర్ పరీక్షలు పూర్తవుతాయి.

పట్టుబడ్డ విద్యార్థుల వివరాలు
పరీక్ష            రంగారెడ్డి హైదరాబాద్
ఫస్టియర్        32  32
సెకండియర్    39  39

మరిన్ని వార్తలు