తుపాకుల మోత..అవినీతి రోత!

28 Dec, 2015 01:22 IST|Sakshi
తుపాకుల మోత..అవినీతి రోత!

ఈ ఏడాది అలజడి సృష్టించిన ఉగ్రవాదులు, ఎన్‌కౌంటర్లు
 
♦ రాష్ట్రం ఏర్పాటయ్యాక వరంగల్‌లో తొలి ఎన్‌కౌంటర్
♦ ఎన్‌కౌంటర్‌పై సందేహాలు.. పోలీసుల తీరుపై విమర్శలు
♦ ఉగ్రవాదులను వేటాడుతూ నలుగురు పోలీసుల వీర మరణం
♦ పోలీసులపై తిరగబడిన వికారుద్దీన్ గ్యాంగ్ హతం
♦ విచ్చలవిడిగా రెచ్చిపోయిన డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ మాఫియా
♦ 200 మంది అవినీతి అధికారుల భరతం పట్టిన ఏసీబీ
♦ ‘ఓటుకు కోట్లు’ కుట్రను విజయవంతంగా ఛేదించిన అధికారులు
 
 ఈ ఏడాది తుపాకుల మోతతో రాష్ట్రం దద్దరిల్లింది. ఉగ్రవాదులు, మావోయిస్టుల కార్యకలాపాలతో అలజడి రేకె త్తింది. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అటు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు ఇటు మావోయిస్టులనూ అదుపులో ఉంచగలిగారు. అయితే వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో ఎంటెక్ విద్యార్థిని శ్రుతి, విద్యాసాగర్‌రె డ్డిల ఎన్‌కౌంటర్ విషయంలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక ‘ఓటుకు కోట్లు’ కుంభకోణం రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. ఏకంగా ప్రభుత్వాన్నే అస్థిరపర్చే ఈ కుట్రను ఏసీబీ అధికారులు విజయవంతంగా భగ్నం చేశారు. అంతేకాదు లంచావతారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఇక జైళ్లశాఖ ఏడాది పొడవునా సంస్కరణల బాట పట్టింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగిన అనురాగ్‌శర్మకు పూర్తిస్థాయి హోదా లభించింది. మొత్తం మీద పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించి శాంతిభద్రతలను అదుపులో పెట్టగలిగారు. ప్రభుత్వం కూడా పోలీసులకు భారీగా తాయిలాలు ప్రకటించింది.

     - సాక్షి, హైదరాబాద్
 
 ఉగ్రవాదుల హల్‌చల్
 స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులు రాష్ట్రంలో బీభత్సం సృష్టించారు. ఉగ్రవాది అబుఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలు చేసే ముఠా సభ్యులు ఎండీ ఇజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌లు రాష్ట్రంలోకి చొరబడ్డారు. హైదరాబాద్ మీదుగా విజయవాడకు బస్సులో వెళుతున్న వీరిని నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రశ్నించారు. దాంతోవారు తుపాకులతో విచక్షణా రహితంగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు చనిపోయారు. దీంతో ఆ ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు గాలింపు ప్రారంభించారు. కానీ దొరికినట్లే దొరికి తప్పించుకుంటూ పోయారు. రెండ్రోజుల వేట అనంతరం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద పోలీసులకు తారసపడ్డారు. ఈ సందర్భంగా పరస్పరం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా... ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఎస్సై డి.సిద్ధయ్య హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత వీర మరణం పొందారు.
 
 వికార్ గ్యాంగ్ కాల్చివేత
 సిమి ఉగ్రవాదుల హతం అనంతరం వారం రోజుల వ్యవధిలో మరో ఎన్‌కౌంటర్.. కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌తో పాటు ఆ ముఠాలోని మరో నలుగురిని పోలీసులు హతమార్చారు. పలు ఉగ్రవాద నేరాల్లో విచారణ ఖైదీలుగా ఉన్న వికార్ గ్యాంగ్‌ను వరంగల్ సెంట్రల్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. మార్గం మధ్యలో వికార్ గ్యాంగ్ మూకుమ్మడిగా పోలీసులపై తిరగబడింది. ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో వారంతా హతమయ్యారు.
 
 ఒక్కో ఓటుకు రూ. 5 కోట్లు!
 శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన బరితెగింపు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పదవులే పరమావధిగా ఒక్కో ఎమ్మెల్యేను రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. రూ. 150 కోట్లతో భారీ ఎత్తున పన్నిన ఈ కుట్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) చిత్తు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగి బేరసారాలు చేసిన విషయం వెలుగుచూసింది.

స్టీఫెన్‌సన్‌తో స్వయంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ. మేం మీకు అండగా ఉంటాం..’ అంటూ వ్యాఖ్యానించిన టేపులు బయటకొచ్చాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వాటిని నిజమైనవిగా ధ్రువీకరించింది. ఈ కుట్ర బయటపడిన సందర్భంగా సీఎం కేసీఆర్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం సాగింది. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. న్యాయస్థానంలో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 20 చోట్లకు పైగా ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు టీడీపీకి చెందిన దాదాపు వంద మందిని విచారించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డి నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే ఆ తర్వాత ఈ కేసులో పెద్దగా చర్యలేమీ తీసుకోలేదు.
 
 ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

 రాష్ట్రంలో ఈ ఏడాది మావోయిస్టుల అలజడి కాస్త పెరిగింది. విశ్వవిద్యాలయాలు వేదికగా మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ జరుగుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు శ్రుతి అలియాస్ మహిత (ఎంటెక్ విద్యార్థిని), విద్యాసాగర్‌రెడ్డి హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఇద్దరు మావోయిస్టులను పోలీసులు పట్టుకుని అతి కిరాతకంగా హింసించి చంపారని ప్రజాసంఘాలు ధ్వజమెత్తాయి. దాదాపు 347 సంఘాల మద్దతుతో ఏర్పడిన ప్రజాస్వామ్య వేదిక ఈ ఘటనలో ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ ముట్టడికి యత్నించి విఫలమైంది.
 
 జైళ్లశాఖలో సంస్కరణల యుగం
 ఈ ఏడాది జైళ్లశాఖకు సంస్కరణల సమయంగా చెప్పవచ్చు. జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ ‘మహా పరివర్తనం’ పేరిట జైళ్లను సంస్కరణల బాట పట్టించారు. జైళ్లలో అవినీతికి తావులేకుండా ఉండేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ప్రకటించారు. దీనికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఏడాది నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా జైలు సిబ్బంది రూ. 50 లంచం తీసుకున్నారని ఫిర్యాదురావడంతో వారిని నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. అలాగే ఖైదీల బాగోగులకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలిసో తెలియకో తప్పు చేసి జైలుకు వచ్చిన వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో... వారికి యోగాతో పాటు మానసిక నిపుణుల చేత శిక్షణ తరగతులు, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా స్కిల్ డెవలప్‌మెంట్ తరగతులు నిర్వహించారు. మొత్తంగా ఇలాంటి కార్యక్రమాలతో ఈ ఏడాది 42 మంది ఖైదీలకు వివిధ రంగాలలో జైళ్లశాఖ సంపూర్ణ మద్దతు ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేసింది. మరోవైపు గత నాలుగేళ్లుగా క్షమాభిక్షకు నోచుకోని ఖైదీల విషయంలో ఈ ఏడాది ముందడుగు పడింది. క్షమాభిక్షకు సంబంధించిన జైలు అధికారుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. త్వరలో దాదాపు 300 మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది.
 
 లంచావతారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు
  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏసీబీ జూలు విదిలించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను లంచాలతో పీల్చిపిప్పి చేసే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. లంచావతారుల భరతం పట్టేందుకు సీఎం కేసీఆర్ ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన ప్రత్యేక ఫోన్ నంబర్ 040-23254071కు కేవలం వారం రోజుల వ్యవధిలో వెయ్యి కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకు మొత్తంగా పదివేలకు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం నిత్యం ప్రజలతో సంబంధాలు నెరిపే రెవెన్యూ, పోలీసు తదితర శాఖలపైనే కావడం గమనార్హం. ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు మదింపు చేసుకున్న ఏసీబీ.. భారీగా దాడులు నిర్వహించి, దాదాపు 200 మంది అవినీతి అధికారుల భరతం పట్టింది. వారిలో 80శాతం మందికి శిక్షపడేలా చర్యలు తీసుకుంది. ఇక టెక్నాలజీని ఆధారంగా చేసుకొని భారీగా ఆస్తులు కూడబెట్టే అవినీతిపరుల తాట తీసేందుకు సైతం సైబర్ ఫోరెన్సిక్ సెల్‌ను ఏసీబీ ఏర్పాటు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాలోని వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను సైతం ప్రారంభించింది.
 
 రెచ్చిపోయిన స్మగ్లింగ్ మాఫియా

 రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ మాఫియా రెచ్చిపోయింది. వందల కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌తోపాటు బంగారం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు సవాల్ విసిరింది. దక్షి ణ అమెరికాకు చెందిన మూసా అనే మహిళ పొట్టలో కోటి రూపాయల విలువైన 56 కొకైన్ ప్యాకెట్లను పెట్టుకొని వస్తూ... నార్కొటిక్ అధికారులకు పట్టుబడ్డారు. డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు ఈ ఏడాది కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలతో పాటు విదేశీ సిగరెట్లు వంటి వాటిని పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ కిలోల కొద్దీ అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడుతూనే ఉంది.
 
 బ్యాంకులకు కుచ్చుటోపీలు
 ఈ ఏడాది బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.కోట్ల సొమ్మును కొల్లగొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనారిటీ కార్పొరేషన్ నిధులు రూ. 55 కోట్లను దారి మళ్లించడంతో పాటు ఏకంగా హైకోర్టు లిక్విడేటర్ అధీనంలో ఉన్న సొమ్మునూ కొల్లగొట్టారు. ఖాయిలా పడిన పరిశ్రమల సొమ్ము సెటిల్‌మెంట్ కోసం హైకోర్టు లిక్విడేటర్‌ను నియమించింది. ఆ సొమ్ములో మల్కాజిగిరి, ఘట్‌కేసర్ బ్యాంకుల్లో ఉంచిన రూ.30 కోట్లను దళారులు దారి మళ్లించారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు.. లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. గతేడాది పెద్ద ఎత్తున బ్యాంకు దోపిడీలకు పాల్పడిన బాలమురుగన్‌ను పోలీసులు పట్టుకుని, రూ.కోటి 72 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
 
 అనురాగ్‌శర్మకే పూర్తిస్థాయి పగ్గాలు
 రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకంపై ఏడాదిన్నరగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనురాగ్‌శర్మకే పూర్తిస్థాయి డీజీపీగా పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించారు. అంతకుముందు డీజీపీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లను సూచించింది. 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనురాగ్‌శర్మతో పాటు ఎన్‌పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ (1979 బ్యాచ్), ఏసీబీ డీజీ ఏకే ఖాన్(1981), కోడె దుర్గాప్రసాద్(1981), ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్‌మీనన్ (1983) అందులో ఉన్నారు. వీరిలో డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ అనురాగ్‌శర్మతో పాటు ఏకే ఖాన్, అరుణాబహుగుణ పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణాధికారం మేరకు సర్వీసులో అందరి కంటే జూనియర్ అయిన అనురాగ్‌శర్మను నియమించింది. ఈయన 2017 వరకు డీజీపీగా కొనసాగనున్నారు.

 పోలీసు సంక్షేమానికి పెద్దపీట
 రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటే పెట్టుబడులు భారీగా తరలివస్తాయన్న యోచనతో ప్రభుత్వం పోలీసు సంక్షేమానికీ పెద్దపీట వేసింది. పోలీసుస్టేషన్లను ఆధునీకరించడంతో పాటు హైదరాబాద్‌లో రూ. 300 కోట్లతో 24 అంతస్తులతో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పోలీసుశాఖకు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలు సమకూర్చడంతో పాటు అలవెన్స్‌లు పెంచారు, సిబ్బందికి ఇళ్ల స్థలాలిస్తామనీ ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో పోలీసు కానిస్టేబుళ్ల కోసం రెండు శాతం ఇళ్లను రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అందజేసే పరిహారాన్ని నాలుగు రెట్లు పెంచారు.

మరిన్ని వార్తలు