మాటలతో మభ్యపెడుతున్నారు

9 Sep, 2017 23:05 IST|Sakshi
మాటలతో మభ్యపెడుతున్నారు

- చేసిన కార్యక్రమాలే మళ్లీ మళ్లీ చేస్తున్న చంద్రబాబు
- రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


అనంతపురం: చేసిన ప్రారంభోత్సవాలు.. కార్యక్రమాలే మళ్లీ మళ్లీ చేస్తూ తానేదో చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారన్నారు. గతేడాది హంద్రీనీవా రెండోదశలో రాప్తాడు నియోజకవర్గం వరకు నీళ్లు పారించి మమ అనిపించారని మండిపడ్డారు.

2014 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సీఎం అనేక ప్రాజెక్టులు ప్రకటించారని గుర్తుచేశారు. పేరూరు డ్యాంకు, బీటీపీకి నీళ్లిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి రూ.850 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టం అని చెబుతున్నారు.. 52వ ప్యాకేజీకి సంబంధించి రాకెట్ల లిఫ్ట్‌ పైన 8 వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయడమనేది ఇప్పటికే లైవ్‌లో ఉందన్నారు. మళ్లీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏంటని ప్రశ్నించారు.

ఉరవకొండలో ప్రకటించిన లిఫ్ట్‌ ద్వారా 20 వేల ఎకరాలు, బీటీపీ ద్వారా 20 వేల ఎకరాలు, పేరూరు లిఫ్ట్‌ ద్వారా 10 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు వేస్తున్నారన్నారు. కేవలం రూ.300 కోట్లతో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే వీలున్నా దానిపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌ (కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు) బిల్లే ఈశ్వరయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరూరు నాగిరెడ్డి, పార్టీ నాయకులు ప్రసన్నాయపల్లి మహానందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు