మంత్రికి బినామీ అమిలినేని

12 Dec, 2016 15:07 IST|Sakshi

– వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
అనంతపురం టౌన్‌ : మంత్రి పరిటాల సునీతకు ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత అమిలినేని సురేంద్రబాబు బినామీ అని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హంద్రీనీవా పనుల్లో అర్హత లేకున్నా రూ.110 కోట్ల పనులను నామినేషన్‌ కింద అమిలినేనికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మంత్రి సునీత రాసిన లేఖ ఆధారంగానే అతడిని పనులు కట్టబెట్టారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ పనుల్లో కట్ట ఎత్తు మూడు మీటర్లు తగ్గించారని, దీంతో రూ.12 కోట్లు ప్రభుత్వానికి కట్టాలని అధికారులు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆ మొత్తాన్ని విడుదల చేయడంలో ఆంతర్యమేమిటన్నారు.

8వ ప్యాకేజీలో కూడా రూ.19 కోట్లు అదనంగా చెల్లింపులు చేశారన్నారు. ఎన్నికలకు ముందు సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్న అమిలినేని చేతుల్లో ఇప్పుడు రూ.1,000 కోట్ల పనులు ఉన్నాయన్నారు. రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో జరిగే పనులకు సంబంధించి ఇతడికి పోటీగా ఎవరూ టెండర్‌ వేయరని, దీని వెనుక మంత్రి హస్తం లేదా అని ప్రశ్నించారు.  ఈ రెండేళ్ల కాలంలోనే అతడు రూ.200 కోట్లు సంపాదించారని, ఈ లెక్కలు చూపకపోవడంతోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నట్లు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా ఈయన వద్ద నగదు ఉందన్న ప్రచారమూ సాగిందన్నారు.  సుమారు రూ.100 కోట్లు (రూ.500, రూ.1000 నోట్లు) రూ.2000 నోట్లుగా అనంతలో మార్చుకున్నట్లు ప్రచారంలో ఉందన్నారు. 

ఈ నగదు ఆయనదేనా? లేక మంత్రిదా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రోడ్లు, హంద్రీనీవా కాలువలు, పైప్‌లైన్‌ పనులను ప్రజాప్రతినిధికి కప్పం కట్టాకే సొంతం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. ఆ డబ్బులను ఈ కంపెనీలోనే దాచుకున్నారన్న ప్రచారం జరుగుతోందని, దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఐటీ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు జనం అనుకుంటున్నారని, అవి ఎవరివో చెప్పాలన్నారు. లేనిపక్షంలో 2019లో ప్రజలే వారికి సమాధానం చెబుతారన్నారు.

మరిన్ని వార్తలు