సాగునీటి వనరులతోనే ‘అనంత’ సమగ్రాభివృద్ధి

29 Jun, 2017 22:24 IST|Sakshi
సాగునీటి వనరులతోనే ‘అనంత’ సమగ్రాభివృద్ధి

100 టీఎంసీల కోసం ప్రజా ఉద్యమం
– పైసా ఖర్చులేని పనులకు రూ.కోట్ల కేటాయింపు ఎవరి కోసం
– ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం దోపీడి చేస్తున్న టీడీపీ నేతలు
– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  


అనంతపురం అగ్రికల్చర్‌ : సాగునీటి వనరులతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన ‘సాగునీటి ప్రాజెక్టులు-పెరుగుతున్న అంచనాలు, అభివృద్ధికా? అవినీతికా?’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 100 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా కలసి రావాలని కోరారు.

హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయినా 40 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించిన జీఓ విడుదల చేయకుండా చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 32.50 టీఎంసీలు, బీటీపీ ప్రాజెక్టు నుంచి 4.9 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నుంచి పరశురాంపురం బ్యారేజీ మీదుగా బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నీటిని నింపేందుకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటకపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హంద్రీనీవా ఎగువ ప్రాంతాలకు(జీడీ పల్లి) నీటిని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉన్నా.. రూ.1,140 కోట్లతో టెండర్లను ఆహ్వానించడం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు. తాత్కాలిక పద్ధతుల ద్వారా రూ.100 కోట్లతో బోరంపల్లి లిఫ్ట్‌ నుంచి బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లిచ్చే పరిస్థితి ఉన్నా రూ.450 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడున్న చంద్రబాబు సర్కారు మెడలు వంచే విషయంలో పోరుబాటకు సిద్ధం కావాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు, సాగునీటి నిపుణులతో చర్చించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మీసార రంగన్న, ధనుంజయయాదవ్, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, ఐఎన్‌టీయూసీ నాయకులు అమీర్‌బాషా, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎంకే వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మహదేవ్, వన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- పట్టిసీమ అక్రమాలు, పోలవరం అంచనాల పెంపు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేస్తున్నారని.. హంద్రీ–నీవా నీరు కుప్పం తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు.
- కరువు కోరల్లోని అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే సాగునీటి వనరులే శరణ్యమని మానవహక్కుల వేదిక నాయకులు బాషా తెలిపారు.
- జిల్లాకు 35 టీఎంసీల నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుతున్న టీడీపీ మంత్రులు, నేతలు ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా ఆ నీటిని పారించలేకపోయారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు