పోలవరం నిర్వాసితుల నిరసన

6 Oct, 2016 23:23 IST|Sakshi
  • తోటపల్లి బంద్‌ విజయవంతం
  • రెండు గంటల పాటు రాస్తారోకో
  • స్తంభించిన వాహన రాకపోకలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు
  •  
    తోటపల్లి (నెల్లిపాక) :
    పోలవరం నిర్వాసితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్రంగా నిరసన తెలిపారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రిలేదీక్షలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని గురువారం ఎటపాక మండలంలో తోటపల్లి బంద్‌ పాటించారు. ఈ బంద్‌కు వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.  దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10.30గంటలకు భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారిపై వందలాది మంది నిర్వాసితులు బైటాయించి రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వాహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డప్పు వాయిద్యాలతో గిరిజనలు రేల నృత్యాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా కానీ నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన ఈప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు కాంట్రాక్టర్ల లబ్ధికోసం వేల కోట్ల ప్రజా దనం దోచుకునేందుకు ప్రాజెక్టు నిర్మాణంపై అశ్రద్ద చూపుతున్నారని విమర్శించారు. పట్టిసీమ తరహాలోనే నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కొత్త చట్టప్రకారం మెరుగైన ప్యాకేజి, పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ముంపు ప్రాంతాలను సర్వే చేసి ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజి ఇచ్చి పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పూర్తి చేయాలని హెచ్చరించారు. 400 గ్రామాలను జలసమాధి చేసే ప్రాజెక్టు నిర్మించుకుంటూ  ఇక్కడి ప్రజల సమస్యలను గాలికి వదిలేయటం సరైందికాదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో ఎస్సై నాగరాజు అక్కడకు చేరుకుని ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు మాటవినక పోవటంతో సమస్యను ఆయన ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా వివరించారు. మూడు గంటలకు తహసీల్దార్‌ నర్శింహులు వచ్చి హామీ ఇస్తారని చెప్పడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాస్తారోకో విరమించారు. తహసీల్దార్‌  నిర్వాసితుల దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపి మండల కన్వీనర్‌ తానికొండ వాసు, సీపీఎం నాయకులు మర్లపాటి నాగేశ్వరావు,ఐ వెంకటేశ్వర్లు, కాక అర్జున్,కోడూరి నవీన్,గంగుల నర్శింహారావు ఉన్నారు.
     
మరిన్ని వార్తలు